రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ ప్రయాణం, వచ్చేస్తోంది!

Chennai: Indian Railways To Run Low Price Ac Trains Icf To Make - Sakshi

చెన్నై: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తక్కువ చార్జీలతో ఏసీ బోగీలతో కూడిన రైళ్లను ప్రవేశపెట్టేందుకు దక్షిణరైల్వే ఏర్పాట్లు చేసింది. ‘పేదల రథం’ పేరుతో ఆధునిక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పోల్చుకుంటే చార్జీలు స్వల్పం, సౌకర్యాలు అధికం కావడం వల్ల ప్రయాణికులు రైలు ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ కారణంగా రిజర్వేషన్లు చేసుకునే వారి సంఖ్య పెరగడంతో టిక్కెట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో రెండు లేదా మూడు ఏసీ బోగీలు మాత్రమే ఉంటున్నాయి.

వీటిని టూ టైర్, త్రీ టైర్‌ బోగీలుగా విభజించి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. వీటిల్లో కుర్చీల సంఖ్య కూడా పరిమితంగా ఉన్నందున ఏసీ బోగీల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితిని నివారించి ఏసీ బోగీలను కింది, మధ్యతరగతి ప్రజలకు సైతం  అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైళ్లకు “పేదల రథం’ అని పేరుపెట్టారు.

అత్యాధునిక వసతులతో తయారవుతున్న ఒక్కో బోగీలో 83 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిల్లో పడుకుని కూడా ప్రయాణించవచ్చు. సీసీ టీవీ, కెమెరాలు అమరుస్తారు. 110–130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి. చెన్నై పెరంబూరులోని ఇంటెగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ రైలు బోగీల్లో ప్రయాణం మరో ఏడాదికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

చెన్నైకి ఆధునిక సిటీ బస్సులు 
కాలం చెల్లిన సిటీ బస్సుల స్థానంలో అత్యాధునిక బస్సులను తీసుకురానున్నారు. తొలిదశలో 242 బస్సులు చెన్నై రోడ్లలో సందడి చేయనున్నాయి. గ్రేటర్‌ చెన్నై ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ పరిధిలో 3,454 సిటీ బస్సులు నడుస్తున్నాయి. రోజుకు సగటున 30 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 10.5 శాతం మంది మహిళలు ఉచిత పథకం కింద ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజూ రోడ్డెక్కే 3,300 బస్సుల్లో వెయ్యి బస్సులు పాతబడిపోయి మూలపడేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

సిటీ బస్సులను 9 ఏళ్లకు మించి వినియోగించరాదనే నిబంధనను దాటి ప్రయాణిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జర్మన్‌ నిధుల సహకారంతో ప్రభుత్వం చెన్నైకి 242, మధురై, కోయంబత్తూరుకు చెరో 100 లెక్కన మొత్తం 644 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా 242 బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. అత్యంత ఆధునికమైన బస్సుల్లో పూర్తిస్థాయి రక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. జీపీఎస్, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్లు, అత్యవసర ద్వారాలు, రానున్న బస్‌స్టేషన్, చేరుకోబోతున్న ప్రాంతాలను తెలిపే డిజిటల్‌ బోర్డులను అమరుస్తారు.

చదవండి: Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top