Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం! | IRCTC floats tender to monetise passenger data | Sakshi
Sakshi News home page

Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం!

Aug 20 2022 4:14 AM | Updated on Aug 20 2022 4:14 AM

IRCTC floats tender to monetise passenger data - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న ఇండియన్‌ రైల్వేస్‌ కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తాజాగా ప్రయాణికుల డేటాపై దృష్టి సారించింది. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ కంపెనీలకు ఈ డేటాను అందించే వ్యాపారం ద్వారా రూ. 1,000 కోట్ల వరకూ ఆదాయం సమకూర్చుకోవచ్చని (మానిటైజేషన్‌) అంచనా వేస్తోంది. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సర్వీసులను మరింత మెరుగుపర్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని భావిస్తోంది.

ఈ ప్రతిపాదన అమలుకు విధి విధానాలను రూపొందించడానికి కన్సల్టెంట్‌ సర్వీసులను ఐఆర్‌సీటీసీ వినియోగించుకోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టెండరు ప్రకటన జారీ చేసింది.  ఆతిథ్య, ఇంధన, మౌలిక, వైద్య తదితర రంగాల సంస్థలకు ఈ తరహా డేటా ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నట్లు టెండరు ప్రకటనలో పేర్కొంది. ఉదాహరణకు ట్రావెల్‌ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటే.. ఆయా సంస్థలు తమ సర్వీసులు వినియోగించుకోవాలంటూ ప్రయాణికులకు వివరాలను పంపే అవకాశముంది.

‘‘భారతీయ రైల్వేస్‌ తన కస్టమర్‌/వెండార్‌ యాప్‌లు, అంతర్గత యాప్‌లలో ఉండే డేటాను ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని హోటల్, ట్రావెల్, బీమా, వైద్యం, ఏవియేషన్‌ తదితర విభాగాల సంస్థలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం ద్వారా మానిటైజ్‌ చేయదల్చుకుంది. తద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని .. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సేవలను మరింత మెరుగుపర్చవచ్చని భావిస్తోంది’’ అని వివరించింది.

దీనికోసం ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ .. వినియోగదారు డేటాను ఈ విధంగా ఉపయోగించుకోవడంలో గోప్యతా నిబంధనలపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించవచ్చనే అంశంపై తగు సూచనలు చేయాల్సి ఉంటుంది. డేటా ప్రైవసీ విషయంలో చట్టాలు, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను అమలు చేసేందుకు నిబంధనలను క్షుణ్నంగా అధ్యయం చేయా ల్సి ఉంటుంది. ప్రయాణికులు, రవాణా సేవలు ఉపయోగించుకునే కస్టమర్లు మొదలైన వర్గాల ప్రాథమిక డేటాను విశ్లేషించాలి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, అయితే దీన్ని అమలు చేయాలంటూ రైల్వే బోర్డు నుంచి ఒత్తిడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రైవసీకి రిస్కులపై సందేహాలు...
ప్రయాణికుల వ్యక్తిగత డేటాను ఇలా ఎవరికిపడితే వారికి ఇవ్వడమనేది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లయ్యే అవకాశాలు ఉన్నా యని సీయూటీఎస్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ అమోల్‌ కులకర్ణి అభిప్రాయపడ్డారు. సాధారణంగా డేటాను క్రోడీకరించి, ఏ వివరాలు ఎవరివి అనేది బైటపడకుండా గోప్యంగాను, భద్రంగానూ ఉంచాలని ఆయన చెప్పారు. అయితే, గోప్యనీయతను పాటించకుండా ఐఆర్‌సీటీసీ గానీ ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లకు డేటాను ఇచ్చిన పక్షంలో ప్రైవసీ హక్కులకు భంగం కలగడంతో పాటు సదరు డేటా దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని కులకర్ణి పేర్కొన్నారు. అయితే, ఇలా డేటాను షేర్‌ చేసుకోవడం అక్రమం అనేందుకు తగిన చట్టాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ డేటాను షేర్‌ చేసుకుంటే దాన్ని తాను భద్రంగా ఉంచడంతో పాటు థర్డ్‌ పార్టీలు కూడా పటిష్టమైన ప్రమణాలు పాటించేలా ఐఆర్‌సీటీసీ చూడాల్సి ఉంటుందని కులకర్ణి చెప్పారు.

రోజుకు 11 లక్షలకు పైగా టికెట్లు..
రైల్వే టికెట్లను బుక్‌ చేసుకునేందుకు ఏకైక మార్గంగా ఈ విషయంలో ఐఆర్‌సీటీసీకి గుత్తాధిపత్యం ఉంది. కంపెనీ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫాం ద్వారా 43 కోట్ల పైచిలుకు టికెట్లు బుక్‌ అయ్యాయి. రోజువారీ దాదాపు 63 లక్షల లాగిన్స్‌ నమోదయ్యాయి. 8 కోట్ల మంది పైగా యూజర్లు ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకుంటున్నారు. టికెట్ల బుకింగ్స్‌లో దాదాపు 46 శాతం వాటా మొబైల్‌ యాప్‌దే ఉంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీ దగ్గర భారీ స్థాయిలో ప్రయాణికుల డేటా ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement