దేశీయ క్రూడ్‌ ఆయిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ ‘జీరో’..

Centre Slashes Windfall Tax For Domestic Crude Oil To Zero - Sakshi

న్యూఢిల్లీ: డీజిల్, జెట్‌ ఫ్యూయెల్‌– ఏటీఎఫ్‌ ఎగుమతులపై జీరో రేటును కొనసాగిస్తూనే, దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై కూడా ప్రభుత్వం విండ్‌ఫాల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను పూర్తిగా తొలగించింది. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని (ఎస్‌ఏఈడీ) ప్రభుత్వం మంగళవారం నుండి పూర్తిగా తొలగించినట్లు అధికారిక ఉత్తర్వులు వెల్లడించాయి. 

ప్రస్తుతం ఈ పన్ను టన్నుకు రూ.4,100గా ఉంది. చమురు ఉత్పత్తిదారులు, ఇంధన ఎగుమతిదారుల భారీ లాభాలపై పన్ను విధించడానికి సంబంధించిన ఈ లెవీని గత ఏడాది జూన్‌లో ప్రవేశపెట్టిన తర్వాత పూర్తిగా తొలగించడం ఇది రెండవసారి. ఏప్రిల్‌ ప్రారంభంలో పన్నును సున్నాకి తగ్గించారు. అయితే అదే నెల ద్వితీయార్థంలో టన్నుకు రూ. 6,400 విధించడంతో తిరిగి విధించారు. అటు తర్వాత రూ.4,100కి తగ్గించడం జరిగింది. ప్రస్తుతం పన్ను పూర్తగా తీసివేస్తున్నట్లు వెల్లడించింది.

ఏప్రిల్‌4న డీజిట్‌ ఎగుమతులపై, మార్చి 4 నుంచి ఏటీఎఫ్‌ ఎగుమతులపై పూర్తిగా తొలగించిన పన్ను యథాతథంగా కొనసాగుతుందని కూడా తాజా ప్రకటన తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌లో కోతకు ప్రధాన కారణం.. అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్‌కు 80 డాలర్ల నుంచి 75 డాలర్లకు తగ్గడమేనని అధికార వర్గాలు వెల్లడించాయి.   

చదవండి👉 అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతి వేగన్‌ - ఆర్‌!

భారీ ఆదాయాలు.. 
భారత్‌ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. చమురు ఉత్పత్తిదారులు ప్రతి బ్యారెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరను పొందే సందర్భంలో వారు పొందే విండ్‌ఫాల్‌ లాభాలపై ప్రభుత్వం పన్ను విధింపు దీని లక్ష్యం. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. 

అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

క్రూడ్‌ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులపై విధించిన ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం (ఎస్‌ఏఈడీ) వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఖజానాకు దాదాపు రూ.40,000 కోట్ల ఆదాయం లభించింది. దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ ద్వారా 2023–24లో దాదాపు రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. 

చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్‌? అదేంటంటే? 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top