
గడిచిన ఐదేళ్లలో (2024-25 ఆర్థిక సంవత్సరం వరకు) సుమారు రూ.7.08 లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం కూడా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పార్లమెంటుకు తెలిపింది.
లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2.23 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. గత ఐదేళ్లలో గుర్తించిన మొత్తం 91,370 కేసుల్లో జీఎస్టీ ఎగవేత సుమారు రూ.7.08 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో స్వచ్ఛంద డిపాజిట్ ద్వారా వసూలు చేసిన పన్నులు రూ.1.29 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.
2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య 44,938 కేసుల్లో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఐటీసీ మోసం జరిగింది. 2022, 2021 ఆర్థిక సంవత్సరాల్లో జీఎస్టీ ఎగవేతలు వరుసగా రూ.73,238 కోట్లు, రూ.49,384 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ఐటీసీ మోసాలు వరుసగా రూ.28,022 కోట్లు, రూ.31,233 కోట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్ల విలువైన జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు.
2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.32 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించామని, ఇందులో రూ.24,140 కోట్ల నకిలీ ఐటీసీ క్లెయిమ్‌లు ఉన్నాయని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన 30,056 జీఎస్టీ ఎగవేత కేసులలో సగానికి పైగా లేదా 15,283 కేసులు ఐటీసీ మోసానికి సంబంధించినవి. వీటి ద్వారా రూ .58,772 కోట్ల ఎగవేత జరిగింది.