నాసిరకం ప్రెజర్‌ కుక్కర్ల అమ్మకాలు, ఫ్లిప్‌కార్ట్‌పై సీసీపీఏ ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

నాసిరకం ప్రెజర్‌ కుక్కర్ల అమ్మకాలు, ఫ్లిప్‌కార్ట్‌పై సీసీపీఏ ఆగ్రహం!

Published Thu, Aug 18 2022 7:59 AM

Ccpa Fined Flipkart For Selling Poor Quality Pressure Cookers - Sakshi

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌పై సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) రూ.లక్ష జరిమానా విధించింది. వినియోగ హక్కులను ఉల్లంఘనలకు పాల్పడుతూ,తన ప్లాట్‌ఫారమ్‌లో నాసిరకం ప్రెజర్‌ కుక్కర్‌లను విక్రయించడానికి అనుమతించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖేర్‌ వెల్లడించారు. 

ఫ్లిప్‌కార్ట్‌ తన ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించిన మొత్తం 598 ప్రెజర్‌ కుక్కర్‌ల వినియోగదారుల పేర్లనూ నోటిఫై చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విక్రయించిన ప్రెజర్‌ కుక్కర్‌లను రీకాల్‌ చేసి వినియోగదారులకు డబ్బును రీయింబర్స్‌ (తిరిగి చెల్లింపులు) చేయాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ అంశంపై స్థాయీ నివేదికను 45 రోజుల లోపు సమర్పించాలని కూడా ఇ– కామర్స్‌ దిగ్గజాన్ని అథారిటీ ఆదేశించింది.

తీవ్ర ప్రమాదాల నుంచి వినియోగదారులను రక్షించడానికి, వినియోగదారు ప్రయోజనాలే ప్రధాన ధ్యేయంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా  ప్రెజర్‌ కుక్కర్‌లపై ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత గుర్తును ఉపయోగించడాన్ని ప్రభుత్వం 2021 ఫిబ్రవరి నుంచి  తప్పనిసరి చేసింది. అన్ని వంటింటి ప్రెజర్‌ కుక్కర్‌లు ‘ఐఎస్‌ 2347:2017’ ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. ప్రెజర్‌ కుక్కర్‌లను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో విక్రయించినా వీటికి సంబంధించి అత్యధిక భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.  

సీసీపీఏ ప్రకారం, ఫ్లిప్‌కార్ట్‌ తన ’వినియోగ నిబంధనల’లో ప్రెజర్‌ కుక్కర్‌లకు సంబంధించి ప్రతి ఇన్‌వాయిస్‌పై ’ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆధారితం’ అని పేర్కొంది.   వివిధ  పంపిణీ ప్రయోజనాల కోసం విక్రేతలను ’బంగారం, వెండి, కాంస్య’గా గుర్తించింది. అమ్మకాల విషయంలో ఫ్లిప్‌కార్ట్‌ పోషించిన పాత్రను ఇది సూచిస్తుంది.  తన ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి ప్రెజర్‌ కుక్కర్‌లను విక్రయించడం ద్వారా రూ. 1,84,263 ఫీజును సంపాదించినట్లు ఫ్లిప్‌కార్ట్‌ అంగీకరించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు విక్రయించడం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు, ఇందుకు సంబంధించి బాధ్యత నుండి ఫ్లిప్‌కార్ట్‌ తప్పించుకోలేదు.  

విస్తృత అవగాహనా కార్యక్రమాలు.. 
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించి దేశ వ్యాప్తంగా విస్తృత అవగాహనా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖేర్‌ వెల్లడించారు. ఆమె తెలిపిన ముఖ్యాంశాలు... 

► ప్రభుత్వం నోటిఫై చేసిన  కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలను ఉల్లంఘించే నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడం సీసీపీఏ దేశవ్యాప్త ప్రచార లక్ష్యం.  

► ఈ ప్రచారంలో ముఖ్యంగా హెల్మెట్‌లు,  ప్రెజర్‌ కుక్కర్లు, వంట గ్యాస్‌ సిలిండర్లపై దృష్టి సారిస్తోంది. 

 అటువంటి ఉత్పత్తుల తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు లేఖ రాసింది. 

 ప్రచారంలో భాగంగా  ప్రామాణికంగా లేని పలు హెల్మెట్‌లు, ప్రెజర్‌ కుక్కర్‌లను బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (బీఐఎస్‌) అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీలపై చర్యలకు శ్రీకారం చుట్టారు.  

► నేషనల్‌ కన్సూ్యమర్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదుల్లో దాదాపు 38% ఇ–కామర్స్‌కు సంబంధించినవి. ఇందులో లోపభూయిష్ట ఉత్పత్తి డెలివరీ, చెల్లింపుల వాపసులో వైఫల్యం, ఉత్పత్తి డెలివరీలో జాప్యం వంటి అంశాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement