
ఇండియా-బ్రిటన్ దేశాల మధ్య దాదాపు 99% వాణిజ్య వస్తువులపై సుంకాలను నియంత్రించేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా సంతకాలు చేశారు. అయితే భారత ఎగుమతులపై యూకే ప్రతిపాదిత కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎం) ప్రభావం ఎలా ఉండబోతుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఏఎం అనేది 2027లో యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రవేశపెడుతున్న వాతావరణ సంబంధిత సుంకం. ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై వాటి కర్బన ఉద్గారాల ఆధారంగా పన్ను విధిస్తారు.
కార్బన్ పన్నులకు సంబంధించిన స్పష్టమైన నిబంధనలను ఎఫ్‌టీఏలో చేర్చలేదు. అయితే భవిష్యత్తులో యూకే కార్బన్ లెవీల ఒప్పందం కింద భారతదేశ వాణిజ్య ప్రయోజనాలపై ప్రభావం చూపితే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు యూకే నుంచి భారత్ దౌత్య హామీని తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సీబీఏఎంను అమలు చేసేందుకు యూకే ప్రస్తుతం సన్నాహక దశలో ఉంది. ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా ప్రభావితం చెందే వస్తువులు కింది విధంగా ఉన్నాయి.
అల్యూమినియం
సిమెంట్
ఎరువులు
హైడ్రోజన్
స్టీల్
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు దేశీయ వస్తువుల మాదిరిగానే కార్బన్ నిబంధనలకు లోబడి ఉండేలా చూడటం యూకే లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్‌టీఏలో సీబీఏఎం సంబంధిత నిబంధనలు చేర్చబడనప్పటికీ భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఒక ‘వెర్బల్ నోట్(అధికారిక దౌత్య హామీ)’ని కుదుర్చుకున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. దీనిప్రకారం..‘యూకే సీబీఏఎం భారత ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తే, ఎఫ్‌టీఏ కింద మార్కెట్ యాక్సెస్ రాయితీలను హరిస్తే భారత్ తిరిగి సమతుల్యత చర్యలు తీసుకోవచ్చు’ అని సీనియర్ అధికార వర్గాలు చెబుతున్నాయి.