
ఏప్రిల్–జూన్‌లో 149.4కి వ్యాపార విశ్వాస సూచీ
న్యూఢిల్లీ: వ్యయాలు తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ఏప్రిల్–జూన్ వ్యవధిలో వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) 149.4కి పెరగడం ఇందుకు నిదర్శనం. జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 139.3గా నమోదైనట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నవారిలో వచ్చే ఆరు నెలల్లో ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని 78.7 శాతం, దేశీయంగా అమ్మకాలు పెరుగుతాయని 79.1 శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అలాగే ముడి వస్తువుల దిగుమతులు పెరుగుతాయని 54.3 శాతం, పన్నుల ముందు లాభాలు మెరుగుపడతాయని 61 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆరు నగరాలవ్యాప్తంగా జూన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో 479 కంపెనీలు పాల్గొన్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు, కంపెనీల ఆర్థిక స్థితిగతులు, పెట్టుబడుల వాతావరణం తదితర నాలుగు అంశాలు బీసీఐకి ప్రాతిపదికగా ఉంటాయని ఎన్‌సీఏఈఆర్ తెలిపింది.