
ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఆహార ఉత్పతుల నుంచి వచ్చే వ్యర్థాలు దేనికీ పనికిరాకుండా ఉండేవి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉపఉత్పత్తులను(Byproducts) విలువైన, లాభదాయకమైనవిగా కొన్ని కంపెనీలు మారుస్తున్నాయి. ఈ విభాగంలో కంపెనీలు వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. ఇవి ఆహార నష్టాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, లాభదాయకమైన వ్యాపార అవకాశాలకు మార్గం చూపుతున్నాయి.
పండ్ల వ్యర్థాల నుంచి..
సింగపూర్‌లోని డోల్ స్పెషాలిటీ ఇంగ్రీడియెంట్స్ వంటి కంపెనీలు అరటి, పైనాపిల్ తొక్కల వ్యర్థాలను వినూత్నంగా ఉపయోగిస్తున్నాయి. ఈ తొక్కల నుంచి ఎంజైమ్‌లు, నూనెలు, ఫైబర్స్ వంటి విలువైన ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ఉదాహరణకు, అరటి ఫైబర్ పౌడర్‌ను బిస్కెట్లు, తృణధాన్యాల్లో వాడుతున్నారు. కొన్ని రకాల ఫైబర్‌లను వస్త్ర పరిశ్రమలో తిరిగి వినియోగిస్తున్నారు.
సీఫుడ్ వ్యర్థాల వినియోగం
చేపల పొలుసులు, తలలు, ఇతర ఉపఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా ఒమేగా-3-రిచ్ ఫిష్ ఆయిల్ వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇది ఆహార పదార్థాలు, క్రియాత్మక ఆహారాల విభాగంలో డిమాండ్‌ను అందుకోవడంతో పాటు వ్యర్థాలను తగ్గించి లాభదాయకమైన ఆదాయ వనరులను సృష్టిస్తుంది.
బ్రేవరీ వ్యర్థాలతో ఇలా..
బెంగళూరుకు చెందిన సేవింగ్ గ్రెయిన్స్ వంటి సంస్థలు బ్రేవరీల నుంచి మిగిలిపోయిన ధాన్యాలను (Spent Grains) సేకరించి వాటితో రుచి, ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.
అప్‌సైకిల్
జైపూర్‌లోని ది మిస్ఫిట్స్ వంటి సంస్థలు సాధారణంగా మార్కెట్‌లో కొనుగోలుదారులు తిరస్కరించే పండ్లు, కూరగాయలను డిప్స్, జామ్‌లుగా అప్‌సైకిల్ చేస్తున్నాయి. దీని ద్వారా ఆహార నష్టాన్ని పరిష్కరిస్తున్నాయి.
షెల్ఫ్ లైఫ్ పొడిగింపు
ఆహార వ్యర్థాలను అప్‌సైక్లింగ్ చేయడంతో పాటు ఉత్పత్తులు పాడవకుండా అరికట్టడం మరొక ముఖ్యమైన అంశం. చెన్నైలోని గ్రీన్‌పాడ్ ల్యాబ్స్ వంటి స్టార్టప్‌లు పండ్లు, కూరగాయల షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి సహజ మొక్కల సారాలను ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో దాదాపు 40% వృధా అవుతున్న నేపథ్యంలో ఇటువంటి ఆవిష్కరణలు ఆహార నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు..