Chalo: చలో చేతికి షటిల్‌ 

Bus Tracking Platform Chalo Acquires Amazon Backed Shuttl - Sakshi

న్యూఢిల్లీ: ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్‌ఫాం ’చలో’ తాజాగా ఉద్యోగులకు యాప్‌ ఆధారిత బస్సు సర్వీసులు అందించే షటిల్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. అయితే, ఇందుకోసం ఎంత మొత్తం వెచ్చించినదీ మాత్రం వెల్లడించలేదు. దేశీయంగా తమ కార్యకలాపాలు లేని పెద్ద నగరాల్లోను, అంతర్జాతీయంగానూ విస్తరించేందుకు షటిల్‌ కొనుగోలు ఉపయోగపడగలదని పేర్కొంది.

షటిల్‌ సర్వీస్‌ ఇకపై కూడా అదే బ్రాండ్‌ పేరుతో కొనసాగుతుందని వివరించింది. షటిల్‌కు చెందిన 60 మంది సిబ్బంది తమ సంస్థలో చేరతారని చలో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్‌ దూబే తెలిపారు. రెండు సంస్థలు కలిస్తే నెలకు 2.5 కోట్ల పైచిలుకు ట్రిప్‌లను నమోదు చేయవచ్చని వివరించారు. కోవిడ్‌–19కి పూర్వం షటిల్‌ హైదరాబాద్‌ సహా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో పాటు బ్యాంకాక్‌ వంటి అంతర్జాతీయ సిటీల్లోనూ కార్యకలాపాలు సాగించేది.

2,000 బస్సులతో రోజూ దాదాపు 1,00,000 ట్రిప్‌లు నమోదు చేసేది. అయితే, కోవిడ్‌–19 దెబ్బతో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం ప్రాచుర్యంలోకి వచ్చి, కార్యాలయాలకు ఉద్యోగులు ప్రయాణించడం తగ్గడంతో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. దీంతో కొనుగోలుదారు కోసం షటిల్‌ కొంతకాలంగా అన్వేషిస్తోంది.   
చదవండి: బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో యువత బంగారు భవిష్యత్‌కు భరోసా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top