తెలంగాణలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..

Burgundy Private Hurun India 500 List: Telangnana Companies Details - Sakshi

కొత్త రాష్ట్రమైనా పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో దేశానికే హబ్‌గా మారింది. తెలంగాణలో నెలక్పొలిన పరిశ్రమలు, తమ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేస్తూ లాభార్జనలోనూ ముందుంటున్నాయి. తాజాగా బర్గండీ ప్రైవేట్‌ హురున్‌ ఇండియా ఐదో ఎడిషన్‌ టాప్‌ 500 ఇండియన్‌ కంపెనీల జాబితాలో ఏకంగా 29 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. 

దివీస్‌ నంబర్‌ వన్‌
దేశంలోనే అత్యంత విలువైన ఐదు వందల కంపెనీల జాబితాను బర్గండీ ప్రైవేట్‌ హురున్‌ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ జాబితా ప్రకారం రూ.1.36 లక్షల కోట్ల విలువతో దివీస్‌ లాబోరేటరీస్‌ తెలంగాణలోనే అత్యంత విలువైన కంపెనీగా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆలిండియా స్థాయిలో ఈ కంపెనీ 33వ స్థానంలో ఉంది.

టాప్‌ 5 కంపెనీలు
దివీస్‌ ల్యాబరేటరీస్‌ తర్వాత స్థానంలో హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ చోటు దక్కించుకుంది. రూ. 1.31 లక్షల కోట్ల విలువతో తెలంగాణలో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలబడింది. ఆలిండియా స్థాయిలో ఈ కంపెనీ 35వ స్థానంలో ఉంది. దివీస్‌, హిందూస్థాన్‌ జింక్‌ తర్వాత డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, లారస్‌ ల్యాబ్‌లు నిలిచాయి. టాప్‌ 5 కంపెనీల్లో నాలుగు ఫార్మా రంగానికి సంబంధించినవే కావడం విశేషం.

రాష్ట్ర జీడీపీలో 18 శాతం వాటా
బర్గండి ప్రైవేట్‌ హురున్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న తెలంగాణకు చెందిన 29 కంపెనీల విలువ 6.9 లక్షల కోట్లు ఉండగా ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కంపెనీల విలువనే రూ. 3.45 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది. ఈ 29 కంపెనీలు సుమారు రెండు లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ రాష్ట్ర జీఎస్‌డీపీలో 18 శాతం వాటాను దక్కించుకున్నాయి.

బర్గండి లిస్టులో మరిన్ని ఆసక్తికర అంశాలు
- టాప్‌ 500 కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కి చెందిన బ్రైట్‌కామ్‌ గ్రూపు 2,791 శాతం వృద్ధిరేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన కంపెనీగా ప్రథమ స్థానంలో నిలిచింది.
- రూ. 2010 కోట్ల కార్పోరేట్‌ ట్యాక్స్‌తో హెల్త్‌కేర్‌ (న్యుమరో యూనో) సెక్టార్‌లో అధిక పన్ను చెల్లించిన కంపెనీగా గుర్తింపు పొందింది.
- నెట్‌ ప్రాఫిట్‌ విషయంలో టాప్‌ 20 కంపెనీల్లో తెలంగాణ కంపెనీలు రెండు చోటు దక్కించుకున్నాయి.  హిందుస్థాన్‌ జింక్‌ రూ.7980 కోట్లతో 13వ స్థానం, అరబిందో ఫార్మా రూ.5389 కోట్లతో 19వ స్థానం దక్కించుకున్నాయి.
- రూ. 28,900 కోట్ల విలువతో మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ టాప్‌ 10 బూట్‌స్ట్రాప్డ్‌ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది.

కంపెనీ                        విలువ         
దివీస్‌ లాబ్యరేటరీస్‌      రూ.1.36 లక్షల కోట్లు 
హిందూస్థాన్‌ జింక్‌        రూ.1.31 లక్షల కోట్లు
డాక్టర్‌ రెడ్డీస్‌              రూ. 77 వేల కోట్లు
అరబిందో ఫార్మా         రూ. 41 వేల కోట్లు
లారస్‌ ల్యాబ్స్‌           రూ.30 వేల కోట్లు

చదవండి: కరోనా ఉన్నప్పటికీ.. రూ. 228 లక్షల కోట్లకు చేరిన క‍ంపెనీలు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top