మార్కెట్‌ విలువలో బీఎస్‌ఈ సరికొత్త రికార్డ్‌

BSE Market value hits rs 191 trillion mark first ever - Sakshi

రూ. 191 ట్రిలియన్లకు బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల విలువ

సోమవారం వరకూ 9 రోజులపాటు మార్కెట్ల రికార్డుల ర్యాలీ

9 సెషన్లలో సెన్సెక్స్‌ 2,623 పాయింట్లు అప్‌

మార్కెట్‌ విలువకు దాదాపు రూ. 13 లక్షల కోట్లు ప్లస్‌

ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్ల కారణంగా మరో సరికొత్త రికార్డు ఆవిష్కృతమైంది. సోమవారానికల్లా మార్కెట్లు వరుసగా 9 రోజులపాటు లాభపడుతూ వచ్చాయి. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 2,623 పాయింట్లు జంప్‌చేసింది. మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 12,89,863 కోట్లకుపైగా జత కలిసింది. వెరసి బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ అంటే లిస్టెడ్‌ కంపెనీల విలువ తొలిసారి రూ. 191 లక్షల కోట్లను తాకింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఈ విలువ డాలర్ల రూపేణా 2.6 ట్రిలియన్లకు సమానంకావడం విశేషం! (బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి పోస్టాఫీస్‌ బ్యాంక్‌)

పలు అంశాల సపోర్ట్‌
కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ ఈక్విటీలలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తుండటం ప్రధానంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత రెండు నెలల్లోనే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో ఏకంగా 14 బిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసినట్లు ప్రస్తావించారు. దీనికితోడు ఇటీవల దేశీయంగా రెండు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో సెంటిమెంటు బలపడిందని తెలియజేశారు. డిసెంబర్‌లో రికార్డ్‌ స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు నమోదుకావడం, ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రికవర్‌ అవుతున్నట్లు ఆర్‌బీఐ నివేదిక తాజాగా అభిప్రాయపడటం వంటి పలు సానుకూల అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు వివరించారు.  (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్‌)

2020లోనూ
బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ తొలిసారి రూ. 191 ట్రిలియన్‌ మార్క్‌ను సాధించిన నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కంపెనీ ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ తాజాగా రూ. 12,49,218 కోట్లను అధిగమించింది. ఈ వెనుకే సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌ రూ. 11,50,106 కోట్ల విలువతో రెండో ర్యాంకును సాధించింది. కాగా.. కోవిడ్‌-19 సంక్షోభంలోనూ 2020లో సెన్సెక్స్‌ దాదాపు 16 శాతం పురోగమించిన విషయం విదితమే. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 32.49 లక్షల కోట్లమేర వృద్ధి చెందింది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top