తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్‌

Serum must distribute vaccines in India first- no exports - Sakshi

తొలి 10 కోట్ల డోసేజీలు రూ. 200 ధరకే

కోవాక్స్‌కు మార్చి తరువాతే సరఫరాలు

డిసెంబర్‌కల్లా కోవాక్స్‌కు 20-30 కోట్ల డోసేజీలు

న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్‌-19 కట్టడికి దేశీయంగా వ్యాక్సిన్లను రూపొందిస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తొలుత వీటిని ప్రభుత్వానికే సరఫరా చేయనుంది. ఇందుకు వీలుగా తొలి దశలో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించినట్లు కంపెనీ వెల్లడించింది. తొలి దశలో దేశీయంగా అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేసేటంతవరకూ ఎగుమతులకు అవకాశముండదని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదార్‌ పూనావాలా పేర్కొన్నారు. ఈ షరతులపైనే వ్యాక్సిన్‌కు తాజాగా అనుమతి లభించినట్లు తెలియజేశారు. ఇదేవిధంగా వ్యాక్సిన్‌ను ప్రయివేట్‌ మార్కెట్లోనూ విక్రయించేందుకు వీలుండదని ఒక ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు. 

చౌక ధరలో
ప్రభుత్వానికి ఒక్కో డోసునూ రూ. 200 ధర(2.74 డాలర్లు)లో చౌకగా సరఫరా చేయనున్నట్లు పూనావాలా వెల్లడించారు. తొలి దశలో 10 కోట్ల డోసేజీలను చౌక ధరలో అందించనున్నట్లు తెలియజేశారు. తదుపరి వ్యాక్సిన్‌ ధరలు పెరగనున్నట్లు చెప్పారు. దేశీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే తొలి ప్రాతిపదికగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు తెలియజేశారు. 7-10 రోజుల్లో వ్యాక్సిన్స పంపిణీ చేపట్టనున్నట్లు చెప్పారు. తదుపరి కాలంలో ప్రయివేట్‌ మార్కెట్లలో వీటిని రూ. 1000 ధరలో విక్రయించే వీలున్నట్లు చెప్పారు. 

కోవాక్స్‌కు 
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవాక్స్‌కు వ్యాక్సిన్ల సరఫరా చేసేందుకు మార్చి, ఏప్రిల్ వరకూ వేచిచూడవలసి ఉంటుందని పూనావాలా పేర్కొన్నారు. గవీ(జీఏవీఐ), సీఈపీఐల భాగస్వామ్యంలో పేద, మధ్యాదాయ దేశాలకు కోవాక్స్‌ ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేయనున్న సంగతి తెలిసిందే. సంపన్న దేశాలు వ్యాక్సిన్ల సరఫరా కోసం పలు కంపెనీలతో తొలి దశలోనే ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. 

ఆస్ట్రాజెనెకాకు
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌ను దేశీయంగా కోవీషీల్డ్‌ పేరుతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా 10 కోట్ల డోసేజీలను ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయవలసి ఉంది. అంతేకాకుండా నోవోవాక్స్‌కు సైతం 10 కోట్ల వ్యాక్సిన‍్ల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు 30-4 కోట్ల డోసేజీల సరఫరాకు వీలుగా కోవాక్స్‌తో డీల్‌పై చర్చలు తుది దశకు చేరినట్లు పూనావాలా పేర్కొన్నారు. వెరసి ఇటు దేశీ ప్రభుత్వానికి, అటు కోవాక్స్‌కూ వ్యాక్సిన్ల సరఫరాలో బ్యాలన్స్‌ను పాటించవలసి ఉన్నట్లు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top