
చైనా కీలక నిర్ణయం
అమెరికాకు కోలుకోలేని షాక్
రక్షణ నుంచి సాఫ్ట్‌వేర్ దాకా ప్రభావం
మూడొంతులు చైనా దిగుమతులే
ఇతర దేశాలపైనా తీవ్ర ప్రభావం
బీజింగ్/బ్యాంకాక్: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదన్న చైనా, అనుకున్నట్టుగానే అమెరికాకు గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో ఈ మేరకు పేర్కొంది.
గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. అమెరికా ఈ ఖనిజాలను 72 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.
రక్షణ రంగ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్‌తో పాటు కార్ల తయారీ కంపెనీ టెస్లా, టెక్ దిగ్గజం యాపిల్ వంటి ఎన్నో సంస్థలు చాలా రకాలైన కీలక ముడి పదార్థాల కోసం ప్రధానంగా చైనా ఎగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఆయా ఖనిజ నిల్వలు అమెరికాలోనూ ఉన్నా అక్కడి పరిశ్రమల అవసరాలను అవి ఏమాత్రమూ తీర్చలేవు. దాంతో వాటి లోటును భర్తీ చేసుకోవడం అగ్ర రాజ్యానికి చాలా కష్టతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం వాటా చైనాదే. చైనా నిర్ణయంతో అమెరికాతో పాటు చాలా దేశాలు ప్రభావితం కానున్నాయి.
ఢీ అంటే ఢీ
అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు కొద్ది రోజులుగా తారస్థాయికి చేరుకోవడం తెలిసిందే. చైనాపై సుంకాలను ఏకంగా 145 శాతానికి పెంచుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకారంగా అమెరికాపై చైనా 125 శాతం సుంకాలు విధించింది. అంతేగాక ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని కూడా ఏప్రిల్ 2వ తేదీనే ప్రకటించింది. చైనా తమతో చర్చలకు వచ్చి సుంకాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగా, ఆ ప్రసక్తే లేదని చైనా కుండబద్దలు కొట్టడం తెలిసిందే. అంతేగాక ఆయనవి మతిలేని చర్యలంటూ గట్టిగా నలుగు పెట్టింది. ‘‘ఈ ప్రతీకార సుంకాలతో ఎవరికీ మేలు జరగదు. వాణిజ్య యుద్ధంలో విజేతలంటూ ఉండరు. అమెరికా బెదిరింపులకు లొంగే సమస్యే లేదు’’ అని స్పష్టం చేసింది. అమెరికా ముందుకొస్తేనే చర్చలకు సిద్ధపడతామని కూడా తేల్చేసింది.
చైనాయే దిక్కు
అమెరికా కొన్నేళ్లుగా చైనా దిగుమతులపై విపరీతంగా ఆధారపడుతున్న కీలక విభాగాల సంఖ్య గత పాతికేళ్లలో అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం 532 రకాల కీలక ఉత్పత్తి విభాగాల విషయంలో అగ్ర రాజ్యానికి చైనా దిగుమతులే దిక్కు. ఇదే సమయంలో చైనా ప్రధానంగా అమెరికా ఉత్పత్తులపై ఆధారపడ్డ విభాగాల సంఖ్య మాత్రం సగానికి సగం తగ్గిపోయింది. అంతేగాక అమెరికా నుంచి పలు కీలక వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై చైనా ఆంక్షలు విధించనుంది. అగ్ర రాజ్యానికి ఇది కూడా కోలుకోలేని దెబ్బే. అమెరికా సోయాబీన్ ఎగుమతులు తదితరాల్లో 10 శాతానికి పైగా వాటా చైనాదే.