
ద్రవ్యోల్బణం గణాంకాలూ కీలకమే...
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ తదితర బ్లూచిప్ ఫలితాలపై ఫోకస్
ఈ వారం మర్కెట్ గమనంపై విశ్లేషకుల అభిప్రాయం
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య మళ్లీ భగ్గుమన్న టారిఫ్ వార్‌తో అమెరికా మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఈ భౌగోళిక, రాజకీయ పరిణమాలపై ఫోకస్ చేయనున్నారు. మరోపక్క, దేశీయంగా విడుదల కానున్న ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు రెండో త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలు కూడా మన మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలు, రూపాయి కదలికలపై ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టి సారించనున్నారు.
అమెరికా సూచీలు విలవిల..
రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా తాజా ఆంక్షలతో పాటు పోర్టు ఫీజుల పెంపుపై తీవ్రంగా ప్రతిస్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 1 నుంచి 100 శాతం అదనపు సుంకాల మోత మోగిస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా, కొన్ని రకాల సాఫ్ట్‌వేర్ ఎగుమతులపైనా నియంత్రణలు విధిస్తామని బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మళ్లీ టారిఫ్ వార్ తారస్థాయికి చేరుకుంది. ఇరుదేశాలు ప్రతీకార సుంకాలకు దిగితే అది ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. ఈ దెబ్బకు గత వారాంతం (శుక్రవారం) రోజున అమెరికా సూచీలు కుదేలయ్యాయి.
నాస్‌డాక్ ఏకంగా 3.56 శాతం పతనం కాగా, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 2.71 శాతం, డోజోన్స్ 1.9 శాతం చొప్పున పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌తో పాటు తాజా భౌగోళిక రాజకీయ పరిణామాలు ఈ వారం మన మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ‘దేశీయంగా క్యూ2 ఫలితాలు, ప్రపంచ స్థూల ఆర్థిక గణాంకాలు, యూఎస్–చైనా మధ్య ముదిరిన టారిప్ వార్ వంటివి పలు అంశాలు ఈ వారం మన మార్కెట్ దిశను నిర్దేశించవచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలతో విదేశీ ఇన్వెస్టర్లు మరింత అమ్మకాలకు పాల్పడవచ్చు. దీంతో వర్ధమాన మార్కెట్లతో పాటు కరెన్సీ విలువలపై కూడా ఒత్తిడి ఇంకా పెరిగే అవకాశం ఉంది’ అని ఆన్‌లైన్ ట్రేడింగ్, వెల్త్ టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు.
గణాంకాలు.. ఫలితాలు..
సెపె్టంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు నేడు (13న) విడుదల కానున్నాయి. 14న టోకు ధరల ద్రవ్యోల్బణం డేటా వస్తుంది. మరోపక్క, 2025–26 జూలై–సెపె్టంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాల సీజన్ వేగం పుంజుకోనుంంది. ఈ వారంలోనే ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (13న), టెక్ మహీంద్రా (14న), ఇన్ఫోసిస్ (16న) విప్రో (16న) ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (16న)తో పాటు యాక్సిస్ బ్యాంక్ (15న), రిలయన్స్ ఇండస్ట్రీస్ (17న) కూడా ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇప్పటికే విడుదలైన టీఎస్‌ఎస్ ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచిన నేపథ్యంలో మిగతా ఐటీ కంపెనీల పనితీరును ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు.
మరోపక్క, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఈ వారంలో (మంగళవారం) చేసే ప్రసంగం కూడా మానిటరీ పాలసీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తుందదని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. ‘అమెరికా–చైనా మధ్య మళ్లీ వాణజ్య ఉద్రిక్తతల ప్రభావంతో యూఎస్ మార్కెట్లు గత వారాంతంలో ఒక్కసారిగా కుప్పకూలాయి. దిగజారిన గ్లోబల్ సెంటిమెంట్ ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయొచ్చు. ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగంలో వ్యాఖ్యలు కూడా వడ్డీ రేట్లపై అంచనాలు, ద్రవ్యోల్బణం తీరుపై ఇన్వెస్టర్లకు సంకేతాలు ఇవ్వనుంది’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్‌హెడ్ సంతోస్ మీనా పేర్కొన్నారు.
గతవారమిలా...
మార్కెట్ వరుస పతనానికి ఆర్‌బీఐ పాలసీ తర్వాత బ్రేక్ పడింది. మళ్లీ లాభాల బాట పట్టిన దేశీ మార్కెట్లు వరుసగా రెండో వారం కూడా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 1,294 పాయింట్లు (1.59%), నిఫ్టీ 391 పాయింట్లు (1.57%) చొప్పున ఎగబాకాయి.