ప్రైవేట్ స్పేస్‌స్టేషన్‌లో పరీక్షించిన చైనా
చికెన్, మటన్‌ను రుచిచూసిన చైనా వ్యోమగాములు
న్యూయార్క్: అంతరిక్ష కేంద్రం. ఏ చిన్నపాటి నిప్పురవ్వ అంటుకున్నా రోదసీలోనే అంతా అంటుకుని అగ్నిగోళంగా మండిపోయే అత్యంత సున్నిత ప్రాంతం. అలాంటి అంతరిక్ష కేంద్రంలోనూ వేడివేడి చికెన్ వింగ్స్‌ను అది కూడా ఎలాంటి పొగరాని ప్రత్యేక ఓవెన్‌ను వండుకుని చైనా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోని ఓ ప్రైవేట్ స్పేస్‌స్టేషన్‌లో ఇలా ఓవెన్‌లో చికెన్‌ను వండుకుని తినడం ఇదే తొలిసారి. అసలు అంతరిక్ష కేంద్రంలో వంటచేయడం కూడా ఇదే ప్రప్రథమం. తాము అభివృద్ధి చేసిన స్పేస్ కిచెన్ సాంకేతికతను చైనా ఇలా విజయవంతంగా పరీక్షించింది. పరీక్షించడమేకాదు పనిలోపనిగా ఆ వేడివేడి చికెన్‌ను వ్యోమగాములంతా తిని భారరహిత స్థితిలో మాంసాహార వంటకంలోని మజాను ఆస్వాదించారు. ఇందుకు తియాంగాంగ్ స్పేస్‌స్టేషన్ ( Tiangong Space Station) వేదికైంది. కనీసం 500 సార్లు భూమి మీద విస్తృతస్థాయిలో పరీక్షించాక దానిని తియాంగాంగ్ స్పేస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
తాజాగా ఆహారం దిశగా పయనం
వ్యోమనౌక ద్వారా తీసుకొచ్చిన అతిశీతల ఆహార పదార్థాలకు మళ్లీ వేడి చేసి తినడానికి బదులుగా అప్పుడే వండిన వేడివేడి ఆహారం తినాలనే ఆశ నుంచి హాట్–ఎయిర్ ఓవెన్ ఆలోచన పుట్టుకొచ్చింది. ఓవెన్‌లో పెట్టే వస్తువులను పట్టి ఉంచే పట్టీ, వేడిచేసే మెష్, ఉడికించే ట్రే, సమంగా కాల్చే రోటేటింగ్ బుట్టలతో వినూత్న ఓవెన్‌ను తయారుచేశారు.
‘‘ఓవెన్ గరిష్ట ఉష్ణోగ్రతను 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 190 డిగ్రీ సెల్సియస్‌కు పెంచాం. దీంతో చికెన్, మటన్ వంటి పదార్థాలను అప్పటికప్పుడు వేడివేడిగా తినొచ్చు’’అని చైనా శాస్త్రవేత్త, చైనా ఆస్ట్రోనాట్ రీసెర్చ్, ట్రైనింగ్ సెంటర్‌లో పరిశోధకుడు యువాన్ యోంగ్ చెప్పారు. ఈ ఓవెన్‌ను ఇటీవల షెంజువాన్–21 వ్యోమనౌక ద్వారా భూమి నుంచి తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తాజాగా దీనిని చికెన్, మటన్ ముక్కలను బేక్ చేసి పరీక్షించారు. చికెన్ వింగ్స్‌ను చైనా షెంజువాన్–21, షెంజువాన్–22ల వ్యోమగాములు (astronauts) ఎంచక్కా ఆరగిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
పొగరాకుండా ఏర్పాట్లు
భారరహిత స్థితిలో పొగ కమ్మితే అది ఎప్పటికీ బయటకు పోదు. దాంతో వ్యోమగాముల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వంటలను వండినప్పుడు పొగ వెలువడకుండా ఓవెన్‌లో ప్రత్యేక ఏర్పాటుచేశారు. బహుళ పొరల ఫిల్టర్‌లను దానిలో అమర్చారు. అత్యధిక వేడిమిని ఇచ్చే రసాయన చర్యలు, సాంకేతికత మేళవింపుతో ఓవెన్‌ను తయారుచేశారు. భారరహిత స్థితిలోనూ అది సవ్యంగా పనిచేయడం విశేషం. అంతరిక్ష కేంద్రంలోనూ వాడగల ప్రపంచంలోనే మొట్టమొదటి ఓవెన్ ఇదేనని ఆస్ట్రోనాట్స్ సిస్టమ్‌లో డెప్యూటీ చీఫ్ డిజైనర్ లూ వీబో చెప్పారు. మొక్కజొన్న పొత్తులు వేయించుకునేందుకూ ఇందులో ఏర్పాటు ఉంది. కేక్ సైతం తయారుచేసుకోవచ్చు.
చదవండి: షట్‌డౌన్ తెచ్చిన ఆహార సంక్షోభం
తయాంగాంగ్ స్పేస్‌స్టేషన్‌లో ఉన్నప్పుడు ఏదైనా చైనా జాతీయ ప్రత్యేక దినోత్సవాలు వచ్చినప్పుడు వేడుకల్లో భాగంగా ఈ వంటకాలను ఇందులో తయారుచేయొచ్చు. దీర్ఘకాల అంతరిక్ష ప్రాజెక్టుల్లో వ్యోమగాములకు రుచికరమైన ఆహారం అందించే లక్ష్యంతో ఈ ఓవెన్‌ను తయారుచేసినట్లు చైనా తెలిపింది. స్పేస్ బార్బెక్యూతో పసందైన వంటకాలను తినబోతున్నామని చైనా వ్యోమగాములు చెప్పారు. గతంలో రష్యా, అమెరికా, చైనా సంయుక్తంగా నిర్మించిన, ప్రస్తుతం విధుల్లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో చాక్లెట్‌చిప్ కుకీలను బేక్ చేసినా అందుకు చాలా సమయం పట్టింది. కానీ చైనా వ్యోమగాములు కేవలం 28 నిమిషాల్లోనే చికెన్ వింగ్స్‌ను సంపూర్ణంగా ఉడికించి శెభాష్ అనిపించుకున్నారు. మటన్ ముక్కలనూ బేక్ చేశారు.


