మరో రెండు సంస్థలకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’హోదా
జాబితాలో హైదరాబాద్ సీ–మెట్, బెంగళూరు ఐఐఎస్సీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్ అవసరాలకు అత్యంత ముఖ్యమైన ‘కీలక ఖనిజాల’రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేసేందుకు కేంద్ర గనుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’(సీఓఈ) హోదాను కల్పించింది. ఈ జాబితాలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ–మెట్), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) చేరాయి. దీంతో ఈ హోదా పొందిన మొత్తం సంస్థల సంఖ్య 9కి పెరిగింది.
ఇటీవల కేంద్ర గనుల శాఖ కార్యదర్శి పియూష్ గోయల్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. గుర్తింపు పొందిన ఈ సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాయి. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక కన్సార్టియంగా పనిచేస్తుంది. ఇందులో కనీసం ఇద్దరు పరిశ్రమ భాగస్వాములను, ఇద్దరు ఆర్‌అండ్‌డీ/విద్యాసంస్థల భాగస్వాములు ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల్లో జరిగే పరిశోధనల్లో కనీసం 90 పరిశ్రమలు, విద్యా/పరిశోధన సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని గనుల శాఖ తెలిపింది.


