గత 22 నెలల్లో భారీగా ఉన్నతాధికారుల మార్పు
రాజకీయ ఒత్తిళ్లు సహా పలు కారణాలతో ఎవరూ కుదురుకోక ముందే వేటు
ఫలితంగా ఆ శాఖ విధాన నిర్ణయాల్లో జాప్యంతో ఖజానాకు ఆదాయంపై ప్రతికూల ప్రభావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖలో తరచూ బదిలీల పర్వం కొనసాగుతోంది. గత 22 నెలల్లో గనుల శాఖతోపాటు అనుబంధ డైరెక్టరేట్, ఖనిజాభివృద్ధి సంస్థలో భారీగా ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. పూర్తి అదనపు బాధ్యతల పేరిట ఇన్‌చార్జి అధికారుల పాలనే కొనసాగుతోంది.
రాజకీయ ఒత్తిళ్లు, ఆదాయ లక్ష్యాలను చేరుకోకపోవడం, వివాదాస్పద పనితీరు, బాధ్యతలపై పట్టు లేకపోవడం తదితర కారణాలతో తరచూ అధికారుల మార్పిడి జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం ఆ శాఖలో విధాన నిర్ణయాల్లో జాప్యానికి కారణం కావడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయంపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది.
రాజకీయ ఒత్తిళ్లే అసలు కారణం?
పాలనాపరమైన మార్పుల్లో భాగంగా జరగాల్సిన అధికారుల బదిలీల వెనుక రాజకీయ కారణాలే బలంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఈ శాఖకు లక్ష్యం నిర్దేశించగా అందులో సుమారు రూ. 1,200 కోట్ల మేర ఆదాయం తగ్గింది. గ్రానైట్, లైమ్‌స్టోన్ లీజుల అక్రమాలను అరికట్టి జరిమానా రూపంలో ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చాలనే లక్ష్యం నెరవేరకపోవడం కొందరు అధికారుల బదిలీకి దారితీసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ వ్యవహారాలు, ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇసుక వెలికితీత, విక్రయాలు, రవాణాలో అక్రమాలు అధికారుల బదిలీల్లో కీలకంగా మారాయని తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ఇసుక క్వారీల లీజ్‌ల కోసం చేసిన ఒత్తిళ్ల వల్ల టీజీఎండీసీ నుంచి ఒకరిద్దరు అధికారులు నిష్క్రమించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి డైరెక్టర్ దాకా..!
2024 జనవరిలో గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బదిలీతో మహేశ్ దత్ ఎక్కా బదిలీపై వచ్చారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఎక్కా స్థానంలో గనుల శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్ బాధ్యతలు చేపట్టారు. సురేంద్ర మోహన్ బదిలీతో ప్రస్తుతం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎన్.శ్రీధర్ ఈ ఏడాది జనవరి నుంచి గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) నిర్వర్తిస్తున్నారు. గనుల శాఖ డైరెక్టర్ స్థానంలో గత 22 నెలల్లో ఆరుగురు అధికారులు మారారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్న పి.కాత్యాయనీదేవి స్థానంలో 2024 జనవరిలో బీవీఆర్ సుశీల్‌కుమార్‌ను నియమించారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో కె.సురేంద్ర మోహన్, డిసెంబర్‌లో కె.శశాంక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరగక ముందే శశాంక స్థానంలో ప్రస్తుతం టూరిజం కార్పొరేషన్ వీసీ, ఎండీగా ఉన్న క్రాంతి వల్లూరును ఇన్‌చార్జిగా నియమించారు. తాజాగా ఈ నెల 20న వల్లూరు క్రాంతిని గనుల శాఖ డైరెక్టర్ పదవి నుంచి తప్పిస్తూ ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
మరోవైపు గత ఏడాది ఆగస్టులో రిటైరైన బీవీఆర్ సుశీల్ కుమార్ గతేడాది అక్టోబర్‌లో టీజీఎండీసీ వీసీ, ఎండీగా రెండేళ్లపాటు ఉండేలా ప్రత్యేక నియామకంపై వచ్చారు. కానీ స్వల్ప వ్యవధిలోనే ఆయన్ను గనుల శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. తాజాగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రత్యేక అధికారిగా (ఓఎస్డీ)గా నియమిస్తూ ఈ ఏడాది మేలో నియమితులయ్యారు. రిటైరైన అధికారికి ఏడాదిలోపే మూడుసార్లు స్థానచలనం కలగడం చర్చనీయాంశమైంది.


