పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న వివాదంపై బ్రిక్స్ కూటమిలో ఉమ్మడి వైఖరిని రూపొందించడం సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ పరిణామాల్లో బ్రిక్స్ సభ్య దేశాలకు నేరుగా ప్రమేయం ఉండటమే దీనికి ప్రధాన కారణమని విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.
జైశంకర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలు
ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో భారత్ నాయకత్వంలోని బ్రిక్స్ కూటమి చురుకైన పాత్ర పోషించాలని అరాగ్చి ఈ సందర్భంగా ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ పోన్ సంభాషణ తర్వాత జైశంకర్ స్పందిస్తూ.. పశ్చిమాసియా పరిస్థితులపై బ్రిక్స్ సభ్య దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు. అయితే, కూటమిలోని కొన్ని దేశాలు ఈ వివాదంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములు కావడమే ఉమ్మడి ప్రకటనకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది.
ఏకాభిప్రాయానికి ఆటంకాలు ఇవే..
బ్రిక్స్ వేదికగా యుద్ధం పరంగా ఒకే మాట వినిపించడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. దీనికి కొన్ని అంశాలు అంశాలు కారణమవుతున్నాయి. జనవరి 2024లో బ్రిక్స్‌లో చేరిన ఇరాన్ ఈ వివాదంలో ప్రధాన పక్షంగా ఉంది. మరో సభ్య దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఈ ప్రాంతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. (2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇరాన్‌తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యూఏఈలకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించారు) సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక ప్రయోజనాలు వేర్వేరుగా ఉండటంతో ఈ సంఘర్షణపై ఒకే రకమైన వైఖరిని తీసుకోవడంలో ప్రతిష్టంభన నెలకొంది.
భారత్ సారథ్యం
బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సంక్షోభ పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తోంది. సభ్య దేశాల మధ్య చర్చలను భారత్ సమన్వయం చేస్తోంది. ‘మార్చి 12న జరిగిన వర్చువల్ బ్రిక్స్ షెర్పా సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. పశ్చిమాసియాలోని సభ్య దేశాల నాయకులతో భారత అగ్రనాయకత్వం నిరంతరం టచ్‌లో ఉంది’ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం


