
ముంబై: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల దిగ్గజం బ్లాక్‌స్టోన్ దేశీయంగా ఇన్వెస్ట్‌మెంట్‌ను రెట్టింపు చేయబోతున్నట్లు తెలియజేసింది. మౌలిక రంగం, క్రెడిట్ బిజినెస్‌ల్లో తాజాగా పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. దేశీయంగా బ్లాక్‌స్టోన్ 50 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఈ బాటలో పెట్టుబడులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.7 లక్షల కోట్లు)కు చేర్చనున్నట్లు బ్లాక్‌స్టోన్ తెలియజేసింది. కాగా.. యూఎస్ టారిఫ్‌లను ఇండియా సమర్ధవంతంగా ఎదుర్కోగలదని సంస్థ ఛైర్మన్ స్టీఫెన్ ఏ ష్వార్జ్‌మ్యాన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఆరేళ్లలో ఆస్తులమ్మి రూ.12,985 కోట్లు సమీకరణ
రెండు దశాబ్దాల పెట్టుబడి ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే అధిక రిటర్నులు అందుకున్నట్లు ష్వార్జ్‌మ్యాన్ వెల్లడించారు. దేశీయంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రహదారి ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ష్వార్జ్‌మ్యాన్ గతంలో ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌నకు సలహాదారుడిగా వ్యవహరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ మధ్య అర్ధవంతమైన సమావేశం జరిగిందని, వాణిజ్య ఒప్పందంపై ఇరు నేతలు అంగీకారానికి వచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే భారత్ అధిక టారిఫ్‌ల అంశంపై కొన్ని సవరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని, 6 శాతానికంటే తక్కువ వృద్ధి నమోదయ్యే అవకాశంలేదని అభిప్రాయ పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment