
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ 2019 నుంచి ఆస్తుల మానిటైజేషన్ ద్వారా దాదాపు రూ.12,985 కోట్లు సమకూర్చుకున్నాయి. ఆస్తుల జాబితాలో భూములు, భవంతులు, టవర్లు, ఫైబర్ తదితరాలున్నట్లు కమ్యూనికేషన్ల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్‌లో వెల్లడించారు.
లోక్‌సభకు మంత్రి నివేదించిన వివరాల ప్రకారం 2025 జనవరి వరకూ భూములు, భవంతుల ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2,388 కోట్లు సమీకరించగా.. ఎంటీఎన్‌ఎల్ రూ.2,135 కోట్లు అందుకుంది. సమీప భవిష్యత్‌లో సొంత అవసరాలకు వినియోగించని, యాజమాన్య బదిలీ హక్కులు కలిగిన భూములు, భవంతులను మాత్రమే మానిటైజ్ చేసినట్లు రాతపూర్వక సమాధానంలో చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇక టవర్లు, ఫైబర్ ఆస్తుల ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ రూ.8,204 కోట్లు, ఎంటీఎన్‌ఎల్ రూ.258 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు.
దీర్ఘకాలిక ప్రభావాలు ఇలా..
టెలికాం పీఎస్‌యూల ఆస్తుల మానిటైజేషన్ ద్వారా దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ఈ ఆస్తుల మానిటైజేషన్ రుణాల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి కంపెనీలకు లిక్విడిటీని అందిస్తుంది. నాన్ కోర్ ఆస్తులను విక్రయించడం ద్వారా ప్రాథమిక టెలికాం సేవలపై దృష్టి పెట్టవచ్చు. మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో పెట్టుబడి పెట్టవచ్చు. అదనపు నిధులతో సర్వీస్ నాణ్యతను మెరుగుపరచడం, మార్కెట్ ఉనికిని విస్తరించడం ద్వారా పీఎస్‌యూలు ప్రైవేట్ సంస్థలతో పోటీపడే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్‌షో
సవాళ్లు ఇలా..
ఆస్తుల మానిటైజేషన్ స్వల్పకాలిక ఆర్థిక ఉపశమనాన్ని అందించినప్పటికీ చందాదారులు పెంపును, అధిక నిర్వహణ ఖర్చులు వంటి అంతర్లీన సమస్యలను ఇది పరిష్కరించకపోవచ్చు. అసెట్ మానిటైజేషన్ చేస్తున్నా ప్రైవేట్ టెలికాం దిగ్గజాల నుంచి తీవ్రమైన పోటీ కారణంగా పీఎస్‌యూలు తమ మార్కెట్ వాటాను తిరిగి పొందడానికి సవాళ్లు ఎదుర్కోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ టెలికాం ఆదాయం క్షీణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఈ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment