
అన్ని కాలాల్లోనూ కొనసాగుతున్న కొనుగోళ్లు
మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌కు మాత్రం పండుగ డిమాండ్
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో వినియోగదారుల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. లోగడ దసరా–దీపావళి పండుగల సమయంలో అధిక శాతం కొనుగోళ్లు నమోదయ్యేవి. కానీ, ఇటీవలి కాలంలో విక్రయాలకు పండుగల సీజన్‌పై ఆధారపడడం తగ్గుతున్నట్టు రెడ్‌సీర్ సంస్థ అధ్యయనంలో తెలిసింది. దేశ ఆన్‌లైన్ రిటైల్ రంగం ఏడాది పాటు స్థిరమైన విక్రయాల వైపు క్రమంగా అడుగులు వేస్తున్నట్టు తెలిపింది. అయితే, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలకు ఇప్పటికీ పండుగల సీజన్ కీలకంగా ఉంటున్నట్టు ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
అంటే దసరా–దీపావళి సమయంలోనే మొబైల్స్, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు అధికంగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ‘‘మొబైల్స్, ఎల్రక్టానిక్స్ అమ్మకాలు సెప్టెంబర్–అక్టోబర్ కాలంలోనే గణనీయంగా పెరుగుతున్నాయి. మొబైల్స్‌కు సంబంధించి సీజనాలిటీ ఇండెక్స్ సాధారణంగా 1.7% కాగా, పండుగల సమయంలో 2.3కు చేరుకుంటోంది. ఎల్రక్టానిక్స్ సంబంధించి ఈ సూచీ 1.3% నుంచి 2.0 శాతానికి పెరుగుతోంది. దీంతో పండుగల సమయంలోనే వీటి డిమాండ్ కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది’’అని రెడ్‌సీర్ నివేదిక తెలిపింది.
మార్కెటింగ్ వ్యూహాలు మారాలి..
అమ్మకాలకు పండుగల సీజన్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించాలని బ్రాండ్లకు రెడ్‌సీర్ పలు సూచనలు చేసింది. ప్రత్యేకమైన ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదా అమ్మకాలు తక్కువగా ఉండే కాలంలో (మొదటి త్రైమాసికం) ప్రచార కార్యక్రమాలు చేపట్టడంపై దృష్టి సారించాలని పేర్కొంది. గ్రోసరీ, సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు డిమాండ్ ఏడాదిపాటు స్థిరంగా ఉంటున్నట్టు తెలిపింది. వీటి అమ్మకాల్లో అస్థిరతలు చాలా తక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది.
ఇంటి అలంకరణలు, ఫర్నిచర్, ఫ్యాషన్ ఉత్పత్తుల అమ్మకాలు పండుగల సమయంలో పెరుగుతున్నప్పటికీ, మొబైల్స్, ఎల్రక్టానిక్స్ స్థాయిలో ఎక్కువగా ఒకే సీజన్‌కు పరిమితం కావడం లేదని వివరించింది. ‘‘దేశ ఆన్‌లైన్ రిటైలింగ్ పరిశ్రమ సంప్రదాయ పండుగల డిమాండ్‌పై ఆధారపడడం క్రమంగా తగ్గుతోంది. ఈ రంగంలోని సంస్థలు డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో సమర్థవంతమైన నిర్వహణతోపాటు.. బలహీన సీజన్‌లోనూ డిమాండ్‌ను సృష్టించుకోవడం ద్వారా స్థిరమైన వృద్ధిని కొనసాగించొచ్చు. కనుక ప్లాట్‌ఫామ్‌లు (ఈ–కామర్స్ సంస్థలు) స్థిరమైన అమ్మకాల డిమాండ్‌ను సృష్టించుకోవడంపై దృష్టి సారించాలని రెడ్‌సీర్ సూచించింది.