
ఏఐ కంటెంట్‌కి మార్కింగ్ తప్పనిసరి చేయడంపై దృష్టి
సోషల్ మీడియాపై బాధ్యత
ఐటీ నిబంధనలను సవరించేలా ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఏఐతో రూపొందించిన కృత్రిమ కంటెంట్ (డీప్‌ఫేక్స్, సింథటిక్ కంటెంట్) నుంచి యూజర్లకు రక్షణ కల్పించే దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలను సవరించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ’ఐటీ రూల్స్ 2021’కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పలు సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం అసలు, నకిలీ కంటెంట్‌కి మధ్య వ్యత్యాసాన్ని యూజర్లు సులువుగా గుర్తించేందుకు వీలుగా సింథటిక్ కంటెంట్‌కి లేబులింగ్, మార్కింగ్ చేయాల్సిన బాధ్యత బడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై (ఎస్‌ఎస్‌ఎంఐ) ఉంటుంది.
అప్‌లోడ్ చేసిన కంటెంట్.. ఏఐతో తయారు చేసినదా లేదా అనేది యూజర్ల నుంచి ఎస్‌ఎస్‌ఎంఐలు డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాకుండా, వారిచ్చిన డిక్లరేషన్ నిజమే నా కాదా అనేది కూడా తగు సాంకేతికతను ఉపయోగించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. విజువల్ అయితే కనీసం 10 శాతం స్థలాన్ని ఆక్రమించేలా, లేదా ఆడియో అయితే ప్రారంభంలోనూ, అది సింథటిక్ కంటెంట్ అని యూజర్లకు స్పష్టంగా తెలిసేలా లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. సదరు కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి లేదా మార్చడానికి తోడ్పడే సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది.
ఇక, ’చట్టవిరుద్ధమైన సమాచారాన్ని’ తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఆదేశాలు జారీ చేసే అధికారం జాయింట్ సెక్రటరీ అంతకు మించిన స్థాయి గల ప్రభుత్వ సీనియర్ అధికారులు, డీఐజీ అంతకు మించిన స్థాయి గలవారికి మాత్రమే ఉంటుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.