
విభిన్నమైన మూలాధారాల నుంచి సమాచారాన్ని విశ్లేషించి వాస్తవిక ప్రపంచ సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించగల కృత్రిమ మేథ ఆవిష్కరణకు బాటలువేసే ‘బ్లూప్రింట్’సిద్ధమైంది. బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం, అలాన్ ట్యూరింగ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ బ్లూప్రింట్‌ను రూపొందించారు. ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రఖ్యాత ‘నేచర్ మెషీన్ ఇంటెలిజెన్స్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
కంటికి కనిపించని, తనకు అర్థంకాని భాష నుంచి సైతం సమాచారాన్ని ఎలాగోలా రాబట్టి దాని సారాన్ని ఒడిసిపట్టే సామర్థ్యంతో కొత్త ఏఐను సృష్టించేందుకు ఈ బ్లూప్రింట్ అక్కరకొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతమున్న ఏఐలు చిత్రాలు, వీడియోలు, వాక్యాలు, శబ్దాలు, సెన్సార్‌లలో ఏకకాలంలో ఏదో ఒకటి, రెండు అంశాల నుంచి మాత్రమే డేటాను సంగ్రహించగలవు. కానీ అన్నిరకాల డేటాను విశ్లేషించేలా మల్టీమోడల్ ఏఐ వ్యవస్థను రూపొందించనున్నారు.
దృశ్య, శ్రవణ, పర్యావరణ, పరిసర, సెన్సార్ డేటాలను ఏకకాలంలో విశ్లేషించగలిగితే స్వయంచోదిత కార్ల వంటి వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. దీంతోపాటే వైద్య, చికిత్స, జన్యు డేటాలను ఏకకాలంలో విశ్లేషించగలిగితే వ్యాధి నిర్ధారణ పరీక్షలతోపాటు ఏఏ ఔషధాల సమ్మేళనం ఎంత మోతాదులో ఖచ్చితత్వంతో పనిచేస్తుందో సులువుగా కనిపెట్టవచ్చు.
‘‘భవిష్యత్ విపత్తులు, సుస్థిర ఇంధనం, వాతావరణ మార్పుల వంటి అంశాలకు పరిష్కారాలు వెతకాలంటే విస్తృతస్తాయి డేటాను లోతుగా విశ్లేషించగలగాలి’’అనిఈ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ హైపింగ్ లూ అన్నారు. షెఫీల్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, మెషీర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈయన ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు.