
ఏఐ వాడకంపై పార్టీలకు కీలక ఆదేశాలు
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) దృష్టి సారించింది. డీప్‌ఫేక్ వీడియోల ద్వారా ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకునే ధోరణిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని తుచ తప్పక పాటించాలని హెచ్చరించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ప్రకటన 6న వెలువడిన విషయం తెల్సిందే.
విమర్శలకు హద్దుండాలి
విమర్శలు విధానాలు, కార్యక్రమాలు, పనితీరుకు మాత్రమే పరిమితం కావాలని ఈసీ పునరుద్ఘాటించింది. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయరాదని స్పష్టం చేసింది. ధ్రువీకరించుకోని ఆరోపణలు, వాస్తవాలను వక్రీకరించే విమర్శలకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ నిబంధనలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌కు కూడా వర్తిస్తాయని తెలిపింది.
ఏఐ కంటెంట్‌కు లేబుల్ తప్పనిసరి
ఏఐ ఆధారిత టూల్స్‌ను దురి్వనియోగం చేసి సమాచారాన్ని వక్రీకరించే, తప్పుడు ప్రచారాలు చేసే డీప్‌ఫేక్‌ల జోలికిపోవద్దని పార్టీలకు ఈసీ సూచించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఒకవేళ ప్రచారం కోసం ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను సోషల్ మీడియా లేదా ప్రకటనల రూపంలో పంచుకుంటే, దానిపై ‘ఏఐ–జెనరేటెడ్’, ‘డిజిటల్లీ ఎన్‌హాన్స్‌డ్’లేదా ‘సింథటిక్ కంటెంట్’వంటి స్పష్టమైన లేబుల్స్‌ను తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా ఉండేందుకు సోషల్ మీడియా పోస్టులపై నిఘా ఉంచినట్లు కమిషన్ తెలిపింది. ఎంసీసీ మార్గదర్శకాల సమర్థవంతమైన అమలు కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.