
సగం ఉద్యోగాల స్వరూపం మారిపోతుంది
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) అమలుతో భారత బ్యాంకింగ్ రంగంలో సగం ఉద్యోగాల స్వరూపం మారిపోతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. ఎన్నో రంగాల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో బీసీజీ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. గత దశాబ్ద కాలంలో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై (ఐటీ) ఐదు రెట్లు అధికంగా వ్యయాలు చేసినప్పటికీ పెరిగిన ఉత్పాదక పరిమితమేనని ఈ నివేదిక తెలిపింది.
నికరంగా పెరిగిన ఉత్పాదకత ఒక శాతమేనంటూ, అంతర్జాతీయ బ్యాంకులతో పోల్చితే భారత బ్యాంకులు వెనుకబడినట్టు పేర్కొంది. కనుక బ్యాంక్‌లు ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదతక పెంపు పరంగా ఉన్న సవాళ్లను అధిగమించొచ్చని తెలిపింది.
ఇప్పటికే చాలా బ్యాంక్‌లు ఈ తరహా టూల్స్‌ను వినియోగిస్తున్నట్టు పేర్కొంది. బ్యాంకులు ఈ తరహా కొత్త సాంకేతికతలను స్వీకరించడం మొదలు పెడితే, గత కొన్నేళ్ల నుంచి ఎదుర్కొంటున్న సంక్లిష్ట వ్యయ సవాళ్లను అధిగమించగలవని బీసీజీ సీనియర్ పార్ట్‌నర్ రుచిన్ గోయల్ పేర్కొన్నారు.
‘ఏఐ వినియోగం పెరిగే కొద్దీ సంఘటిత రంగంలో ఉద్యోగాలకు సవాళ్లు ఎదురవుతాయి. ఐటీ తదితర రంగాల్లో ఇప్పటికే ఉద్యోగుల తొలగింపులు వింటున్నాం. బ్యాంకుల్లోనూ నికర ఉద్యోగుల సంఖ్య పెరుగుదల తగ్గుతోంది. టెక్నాలజీ కారణంగా కొన్ని ఉద్యోగ ఖాళీలను బ్యాంకులు భర్తీ చేయకపోవచ్చు’ అని గోయల్ చెప్పారు. రానున్న రోజుల్లో టెక్నాలజీపై బ్యాంకులు చేసే వ్యయాలు పెరుగుతాయన్నారు.
రుణ వృద్ధి మెరుగుపడాలి..
బ్యాంకుల్లో రుణ వృద్ధి నిదానించడాన్ని బీసీజీ నివేదిక ఎత్తి చూపించింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు వీలుగా బ్యాంకుల రుణ వృద్ది వేగవంతం కావాలని పేర్కొంది. సాధారణ జీడీపీ వృద్ది కంటే 3–3.5 శాతం మేర బ్యాంకుల రుణ ఆస్తులు పెరగాల్సి ఉంటుందని తెలిపింది. 2024–25లో సాధారణ జీడీపీ 9.8 శాతం కాగా, బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతానికే పరిమితమైనట్టు గుర్తు చేసింది.