విద్య, వైద్య సేవలను మరింతగా విస్తరించవచ్చు
సేల్స్‌ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్ అరుంధతి భట్టాచార్య
న్యూఢిల్లీ: కంపెనీలు మరిన్ని లాభాల కోసమే కృత్రిమ మేథ (ఏఐ) జపం చేస్తున్నాయనే అభిప్రాయం మారాల్సిన అవసరం ఉందని సేల్స్‌ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. దీనితో ఉత్పాదకత పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని, వైద్యం..విద్యలాంటి సేవలను గణనీయంగా విస్తరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఏజెంటిక్ ఏఐ వల్ల ఉద్యోగాల తొలగింపు కన్నా ఉద్యోగులకు మరింత సాధికారత లభిస్తుందని వివరించారు.
ఏఐ శకంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు పెరిగే కొద్దీ ఆసుపత్రులు కిక్కిరిసిపోయే అవకాశం ఉందని .. అలాంటి పరిస్థితుల్లో ఏజెంటిక్ ఏఐ, డిజిటల్‌పరమైన మద్దతుతో వాటిపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ వ్యవస్థ విషయానికొస్తే రోగ లక్షణాలను రికార్డ్ చేసేందుకు, పేషంటును చూడటానికి ముందే డాక్టరుకు ప్రాథమిక విశ్లేషణ ఇచ్చేందుకు ఏజెంటిక్ ఏఐ ఉపయోగపడుతుందని భట్టాచార్య చెప్పారు. టెక్నాలజీ, యూపీఐలాంటి ప్లాట్‌ఫాంల వల్లే బ్యాంకింగ్ పరిధిలోని వారికి కూడా సరీ్వసులను విస్తరించేందుకు వీలయ్యిందన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా సేల్స్‌ఫోర్స్‌కి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా కొనసాగుతోందని ఆమె చెప్పారు.


