
అడిగిన సమాచారాన్ని క్షణాల్లో కళ్లముందు ఆవిష్కరించే కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కల కాదు... వాస్తవం! ఐటీలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ దాన్ని సైతం సొంతం చేసుకునేందుకు, ఆ రంగంలో మనవాళ్లను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాథమిక విద్యనుంచే ఏఐపై విద్యార్థులకు అవగాహన పెంచి ప్రపంచ ఏఐ విప్లవంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేక సిలబస్ రూపొందించే కార్యక్రమం మొదలైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చడీ, చప్పుడూ లేకుండా మన సమస్త జీవన రంగాల్లోకీ ఇప్పటికే ప్రవేశించింది. అనేక రంగాల రూపురేఖల్ని సంపూర్ణంగా మారుస్తోంది. పారిశ్రామిక రంగంలో దాని పురోగమనం కని విని ఎరుగని రీతిలో ఉంది. ఏఐ అసాధారణ వృద్ధి... ఉపాధికి సైతం పెను సవాలు విసురుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఏఐకి తగినట్టుగా ఎదగటం తప్పనిసరి.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇకపై తెలివికీ, ఏఐ ఆధారిత పరిష్కారాలకూ రూపశిల్పులు కావాలి. కోడ్ ఉత్పాదన, డీబగ్గింగ్, ఆప్టిమైజేషన్‌లు ఇప్పుడు కీలకం. ఏఐకి తగిన సూచనలు అందజేయగల సమర్థమంతమైన ప్రాంప్ట్ ఇంజినీరింగ్ సంప్రదాయ ప్రోగ్రామింగ్ లంత ప్రాధాన్యం కలిగినదిగా గుర్తించాలి.
యాక్సిడెంటల్ కాంప్లెక్సిటీ (బాయిలర్ ప్లేట్ కోడ్, రొటీన్ టాస్క్స్)ని ఏఐ సునాయాసంగా ఛేదించగలుగుతోంది గనుక ఇంజినీర్లు ఉన్నత స్థాయి పరిష్కారాలిచ్చే ‘అసెన్షియల్ కాంప్లెక్సిటీ’పై దృష్టి పెట్టాలి. ఇవన్నీ సంక్లిష్టలతో కూడిన డిజైన్, ఎథికల్ ఏఐ అమలు, చిక్కుముడులతో ఉండే ఆర్కిటెక్చర్ వగైరాలను నిశితంగా పరిశీలించే నైపుణ్యంగల ఇంజినీర్ల అవసరాన్ని పెంచుతాయి. ఏఐ ఎథిక్స్ నిపుణులు, డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, ఏఐ సమన్వయంలో నిపుణులు, ఏఐ ఆడిటర్లు వంటి ఉద్యోగాలకు మంచి డిమాండు ఉండబోతోంది.
కృత్రిమ మేథ డేటాను విశ్లేషిస్తుంది. కానీ దానికి సందర్భశుద్ధి ఉండదు. ఆరోగ్యం, ఆర్థికం, వ్యవసాయం వంటి భిన్న రంగాల అవసరాలనూ, అందులోని సమస్యలనూ అవగాహన చేసుకున్న ఇంజినీర్లు ఏఐను సమర్థమంతంగా, జాగ్రత్తగా వినియోగించటంలో ఉపయోగపడతారు. విమర్శనాత్మక ఆలోచనలు, సృజనాత్మకత, భాగస్వామ్యం, కమ్యూనికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటివి మనుషులకు మాత్రమే సాధ్యమైన లక్షణాలు. డెలాయిట్ నివేదిక ప్రకారం 90 శాతం యాజమాన్యాలు ఉద్యోగుల నుంచి ఈ సాఫ్ట్ స్కిల్స్ ఆశిస్తున్నాయి.
ఇదీ చదవండి: పోషకాల రాగి : మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం
జీసీసీలకు హైదరాబాద్ అడ్డా
బహుళజాతి సంస్థలు భిన్న ప్రాంతాల్లో తమ వ్యూహాత్మక, సాంకేతిక, నిర్వహణ అవసరాల నిమిత్తం నెలకొల్పే ప్రపంచ సామర్థ్య కేంద్రాలకు (జీసీసీలు) హైదరాబాద్ అడ్డా అయింది. ఇక్కడ 355 జీసీసీలు ఉండగా, వీటిల్లో 3 లక్షలమంది నిపుణులు పనిచేస్తున్నారు. దేశంలోని జీసీసీల్లో ఇది 21 శాతం. ఎలీ లిలీ, మారియెట్ ఇంటర్నేషనల్, ఎవర్‌నార్త్, వ్యాన్ గార్డ్ వంటి ప్రపంచ సంస్థలు తమ జీసీసీలకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. వీటిల్లో అమెరికాలోనే పెద్దదయిన వ్యాన్‌గార్డ్ ఏఐ/ఎంఎల్‌పై ఫోకస్‌తో 2,300 మందిని రిక్రూట్ చేసుకోబోతోంది. అంటే హైదరాబాద్ గ్లోబల్ ఇన్నొవేషన్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందన్న మాట. ఈ జీసీసీ అడ్డా గ్లోబల్ వేల్యూ సెంటర్ల (జీవీసీ) ప్రధాన కేంద్రంగా మారటం ఎంతో దూరంలో లేదు. ఐపీ క్రియేషన్, హై వాల్యూ ప్రొడక్షన్, వీటికి తోడ్పడే రాష్ట్ర ప్రభుత్వ దార్శనికత... జీవీసీలకు దారితీస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ముందు తరాలను ఏఐ విప్లవంలో భాగం చేయడం కోసం తన విద్యావ్యవస్థలో ఏఐని భాగం చేయదల్చుకుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఏఐ మౌలిక సూత్రాలను పరిచయం చేయాలని సంకల్పించింది. ఒకటి, రెండు తరగతుల్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నేర్పించటం, నాలుగు అయిదు తరగతుల గణితంలో ఏఐ ఫండమెంటల్స్‌ను ప్రవేశపెట్టడం దీని ధ్యేయం. ఇందుకు సంబంధించిన పైలెట్ ప్రోగ్రాం కోసం 20 జిల్లాల్లోని వంద ప్రాథమిక పాఠశాలల్ని ఎంచుకోవడం జరిగింది. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్ ఏఐ/ఏఎక్స్‌ఎల్) ప్రోగ్రాం 27 జిల్లాల్లోని 513 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు విస్తరిస్తోంది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ గణిత శాస్త్రంలో ప్రత్యేకించి ఏఐ అంతర్భాగం కాబోతోంది. 5,560 మంది టీచర్లు ఏఐపై శిక్షణ పొందుతున్నారు.
ఏఐని 2025–26 విద్యాసంవత్సరంలో అంతర్భాగం చేయటానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇప్పుడున్న సిలబస్‌లో 20 శాతాన్ని పునస్సమీక్షించటానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఫిన్ టెక్ వంటివి ఈ కోర్సుల్లో అధ్యయనాంశాలు కాబోతున్నాయి. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏఐ/ఎంఎల్ ప్రోగ్రాంలలో కోర్సులు అందజేస్తోంది.
ఏఐ సిటీ రాబోతోంది!
విశాలమైన 200 ఎకరాల్లో ఏఐ సిటీ రూపుదిద్దుకుంటోంది. ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఈ సిటీలో భాగమవుతుంది. ఇందులో 25,000 జీపీయూలు (వీటిపై మొన్న ఏప్రిల్‌లో ఎంవోయూలు అయ్యాయి) ఉండబోతున్నాయి. పర్యవసానంగా దేశంలో అత్యంత శక్తిమంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలకు హైదరాబాద్ కేంద్రం కాబోతోంది.
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
వ్యాసకర్త తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి