
ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఆసియా అంతటా విభిన్న కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకోవడానికి, బ్రాండ్లను విస్తరించడానికి సహాయపడేలా ‘ఆప్ట్రా’ అనే కొత్త కంపెనీని ప్రారంభించారు. టెక్నాలజీ, సప్లై చైన్ నైపుణ్యం, ఫ్రాంఛైజింగ్ భాగస్వామ్యాలను ఉపయోగించుకొని కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించేటప్పుడు బ్రాండ్లు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేలా ఈ స్టార్టప్ ఆయా కంపెనీలను సర్వీసు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వాల్‌మార్ట్ కొనుగోలుకు ముందు ఫ్లిప్‌కార్ట్‌ను ప్రపంచంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఒకటిగా మార్చడంలో బన్సాల్ కీలక పాత్ర పోషించారు. సాంస్కృతిక, నియంత్రణ, మౌలిక సదుపాయాల అవరోధాలతో పోరాడుతున్న బ్రాండ్లకు ప్రస్తుతం బిన్నీ ఆప్ట్రాను ఒక పరిష్కారంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ సాధనాలు, మాస్టర్ ఫ్రాంచైజ్ అవకాశాలను ఏకకాలంలో అందించడం ద్వారా గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశాన్ని సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఏఐ ఆధారిత సాంకేతికత అభివృద్ధి
మొత్తం కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఆప్ట్రా ఏఐ ఆధారిత సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, సమర్థవంతమైన వ్యూహాలను సమీకృతం చేయడం ద్వారా కంపెనీ అంతరాయంలేని మార్కెట్‌ను సృష్టించాలని భావిస్తుంది. ఈ-కామర్స్ కార్యకలాపాలను విస్తరించడంలో బన్సాల్ అనుభవం కంపెనీ సామర్థ్యాన్ని పెంచడానికి రోబోటిక్స్, ఆటోమేషన్‌తో కూడిన గ్లోబల్ సప్లై చైన్‌ను నిర్మించడానికి ఎంతో ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నిపుణులతో నాయకత్వ బృందం
ఈ-కామర్స్, రిటైల్ రంగాలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులతో ఆప్ట్రా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేసింది. నోకియా, యాపిల్ అమెజాన్ ఇండియాలో మాజీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన రంజిత్ బాబును ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ మర్కండైజ్ సీఈఓగా నియమించారు. గతంలో లెండింగ్ కార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన గిరిధర్ యాసను కంపెనీ టెక్నాలజీ విభాగానికి నేతృత్వం వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సప్లై చైన్ కార్యకలాపాలను ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలో అనుభవం ఉన్న ఆనంద్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఎక్స్పోరియో, టెర్రాస్పాన్ బ్రాండ్లలో కీలక స్థానాల్లో పని చేసిన పునీత్ ఖన్నా, రాహుల్ గుప్తాలు ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: గృహ రుణాల మంజూరులో ప్రాంతీయ అసమానతలు
ఆసియా మార్కెట్ కీలకం
ప్రపంచంలోని మొత్తం వినియోగదారుల వృద్ధిలో ఆసియా సుమారు 70% వాటాను కలిగి ఉంది. ఇది ఈ-కామర్స్, మారుతున్న వినియోగదారుల అలవాట్లకు కీలక మార్కెట్‌గా అవతరిస్తోందని కంపెనీ నమ్ముతుంది. భారత్, ఆగ్నేయాసియా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) రీజియన్ మార్కెట్లపై ఆప్ట్రా దృష్టి సారించింది. ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, బేబీ కేర్, జనరల్ మర్కండైజ్ వంటి విభాగాల్లోకి విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment