మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ | Sakshi
Sakshi News home page

మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్

Published Sat, Dec 30 2023 6:13 PM

Bill Gates Says About AI Technology - Sakshi

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ ప్రజలు కూడా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) టెక్నాలజీని రాబోయే రోజుల్లో ఉపయోగించడం మొదలుపెడతారని, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ 'బిల్ గేట్స్' (Bill Gates) వెల్లడించారు. కృత్రిమ మేధస్సు మనం మునుపెన్నడూ చూడని వేగంతో కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని తన బ్లాగ్‌లో రాశారు.

ఇప్పటికే అనేక కంపెనీలు ఏఐ ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నాయని, 2024లో ఇది మరింత వేగవంతం అవుతుందని, దీంతో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని బిల్ గేట్స్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో మనం ఎప్పుడూ చూడలేని అనేక నూతన ఆవిష్కరణలు ఏఐతో సాధ్యమని అన్నారు.

ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను వెతకడంలో ఏఐ పాత్ర ప్రధానంగా ఉండబోతోందని.. ఎయిడ్స్, టీబీ, మలేరియా వంటి వ్యాధులతో పీడించబడే ప్రజలకు సైతం ఏఐ టూల్స్ సాయపడుతుందని వ్యాఖ్యానిస్తూ.. కొన్ని కంపెనీలు క్యాన్సర్ వంటి వాటిని నయం చేయడానికి కావలసిన మందులను అభివృద్ధి చేయడంలో ఏఐ టెక్నాలజీని ఇప్పటికే వాడుతున్నట్లు తెలిపారు.

ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి చాలామంది దిగ్గజ కంపెనీల సీఈఓలు కూడా కొంత ఆందోళన చెందారు. ఏఐ వల్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు కూడా వెల్లడించారు. ఏది ఏమైనా ఏఐ వల్ల కొందరికి నష్టమే వాటిల్లినప్పటికీ కొత్త ఆవిష్కరణలకు ఇది బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుందని బిల్ గేట్స్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి రెండు నిమిషాలకు ఒక స్త్రీ ప్రసవ సమయంలో మరణిస్తుందని, ఇలాంటి ప్రమాదాలను తగ్గించడంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. దీనికోసం 'కోపైలట్' సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు.

ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా..

HIV ప్రమాదాలను కూడా అంచనా వేయడానికి చాట్‌బాట్ ఒక సలహాదారు మాదిరిగా పనిచేస్తుందని, దీని ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు తీసుకోవచ్చని, ఇలాంటిది అట్టడుగు వర్గాల వారికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవచ్చని బిల్ గేట్స్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement