
మిడ్‌క్యాప్ విభాగంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారి ముందున్న ఎంపికల్లో ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ ఒకటి. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం. మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసేందుకు కృషి చేస్తుంది. అధిక రాబడుల కోసం అధిక రిస్క్ తీసుకునే వారికి ఇది అనుకూలం. కనీసం 7–8 ఏళ్లకు మించి పెట్టుబడులు పెట్టే వారికే మిడ్‌క్యాప్ విభాగం సూచనీయం.
రాబడులు
ఈ పథకంలో ఏ కాలంలో చూసినా రాబడులు మెరుగ్గా కనిపిస్తాయి. గత పదేళ్లలో ఏటా 16 శాతం చొప్పున పెట్టుబడులపై రాబడులు అందించింది. ఏడేళ్లలో రాబడి ఏటా 17 శాతం చొప్పున ఉంది. ఐదేళ్లలోనూ ఏటా 27 శాతానికి పైనే ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఏడాది కాలంలో మాత్రం రాబడి కేవలం 2.41 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో మార్కెట్ల పనితీరు స్తబ్దుగా ఉండడం వల్ల రాబడులు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పథకం 1993లో ప్రారంభమైంది. నాటి నుంచి చూసుకున్నా రాబడి ఏటా 19.41 శాతంగా ఉండడం గమనించొచ్చు. అధిక రిస్క్ కేటగిరీ కిందకు ఈ పథకం వస్తుంది.
పెట్టుబడుల విధానం
ఈ పథకం పోర్ట్‌ఫోలియో పరంగా మంచి వైవిధ్యాన్ని పాటిస్తుంటుంది. బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంపిక చేసిన పెట్టుబడులు పెడుతుంటుంది. వివిధ వ్యాపార సైకిల్స్‌ను గమనిస్తూ.. ఆరంభంలోనే అవకాశాలను సొంతం చేసుకునే మార్గంలో పనిచేస్తుంది. వ్యాల్యూ అదే సమయంలో గ్రోత్.. ఈ రెండు పెట్టుబడుల విధానాలకు ప్రాధాన్యం ఇస్తుంటుంది. వాస్తవ అంతర్గత విలువ కంటే తక్కువలో ట్రేడవుతున్న కంపెనీలను గుర్తించి పెట్టుబడులు పెట్టడాన్ని వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌గా చెబుతారు.

ఆయా రంగాల్లో స్వల్పకాల ప్రతికూలతలు, ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో కంపెనీల విలువలు మరింత ఆకర్షణీయమైన స్థాయికి దిగొస్తుంటాయి. అలాంటి సందర్భాలను ఫండ్ మేనేజర్ గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. పెట్టుబడులకు రంగాల వారీ కాకుండా స్టాక్స్ వారీగా పరిశీలన (బోటమ్ అప్) చేస్తుంది. రుణ భారం లేని, తక్కువగా ఉన్న కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పథకం పేరు జూలై 11 ముందు వరకు ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్‌గా కొనసాగడం గమనార్హం.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.12,785 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఎక్స్‌పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్‌లో 0.94 శాతంగా ఉంటే, రెగ్యులర్ ప్లాన్‌లో 1.76 శాతం చొప్పున ఉంది. రెగ్యులర్ ప్లాన్ అంటే మధ్యవర్తులకు కమీషన్ చెల్లించేది. దీంతో ఇన్వెస్టర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుంటారు. దీర్ఘకాలంలో అధిక రాబడి కోసం డైరెక్టర్ ప్లాన్ ఎంపికే మెరుగైనది అవుతుంది. మొత్తం పెట్టుబడుల్లో 97.4 శాతాన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయగా, 2.4 శాతం నగదు నిల్వలు కలిగి ఉంది. పెట్టుబడులను గమనిస్తే 20 శాతం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఉన్నాయి. కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 18.6 శాతం, ఇండస్ట్రియల్స్ కంపెనీల్లో 13.8 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 13.3 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 10.6 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది.