
సాధారణంగా ఎక్కడైనా ఫ్లైఓవర్లు ప్రభుత్వాలు నిర్మిస్తాయి. కానీ బెంగళూరులో మాత్రం ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ సొంతంగా ప్రైవేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకుంది. ఇందుకు ప్రభుత్వమూ అనుమతిచ్చింది. అయితే ఒక్కటే షరతు...
బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ బెళ్లందూర్‌లో నిర్మాణంలో ఉన్న తమ టెక్ పార్క్‌ను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో అనుసంధానం చేయడానికి 1.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను నిర్మించనుంది. ఈ ఫ్లైఓవర్ పబ్లిక్ రోడ్డు పక్కగా, వర్షపునీటి కాలువ మీదుగా వెళ్తుంది.
ఈ ప్రాజెక్టుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఆమోదం తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వ భూమిలో ఫ్లైఓవర్ నిర్మించుకుంటున్నందుకు గానూ దీనికి బదులుగా కరియమ్మన అగ్రహార రోడ్డు వెడెల్పునకు ప్రెస్టీజ్ గ్రూప్ ముందుకు వచ్చినట్లు తెలిసింది. అలాగే ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తామే సొంతంగా నిధులు సమకూర్చడానికి ఈ రియల్ ఎస్టేట్ సంస్థ కట్టుబడి ఉందని ‘హిందూస్థాన్ టైమ్స్’ వార్తా సంస్థ కథనం పేర్కొంది.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రెస్టీజ్ గ్రూప్ మొదట 2022 ఆగస్టులో బెంగళూరు బెంగళూరు మహానగర పాలికెకు ప్రతిపాదనను సమర్పించింది. తరువాత 2023 నవంబర్ లో సవరించిన అభ్యర్థనను సమర్పించింది. తమ ప్రైవేట్ క్యాంపస్ కు ప్రత్యేక ఫ్లైఓవర్ అవసరాన్ని చెప్పేందుకు ఎమలూరు, కరియమ్మన అగ్రహార రోడ్డు మీదుగా ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని కంపెనీ కారణంగా పేర్కొంది.
రాబోయే ప్రెస్టీజ్ బీటా టెక్ పార్క్ లో 5,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వీరి రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించినట్లు సమాచారం.
👉హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్‌లు👈
కొత్త ఫ్లైఓవర్‌పై కేవలం ప్రెస్టీజ్ ఉద్యోగులకే కాకుండా సాధారణ ప్రజల రాకపోకలకూ అవకాశం ఉండాలని బీబీఎంపీ అధికారులు షరతు విధించారు. అన్ని చట్టపరమైన ప్రమాణాలను చేరుకుంటే, రహదారి విస్తరణ కోసం అప్పగించిన భూమికి బదులుగా సంస్థ బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులకు (టీడీఆర్) కూడా అర్హత కలిగి ఉంటుంది. టెక్ పార్క్ బిల్డింగ్ ప్లాన్‌కు అనుమతులు వచ్చిన దాదాపు ఏడాది తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం లభించడం గమనార్హం. 70 ఎకరాలున్న ఈ స్థలానికి 2023 సెప్టెంబరులో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) నుంచి ప్రాథమిక అనుమతి లభించింది.
బెంగళూరు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టు ఆమోదాన్ని ధృవీకరించారు. ఫ్లైఓవర్‌తో పాటు 40 అడుగుల వెడల్పుతో కనెక్టింగ్ రోడ్‌కు కూడా ప్రెస్టీజ్ సంస్థ నిధులు సమకూర్చనుంది. ఈ రోడ్డుతో సక్రా హాస్పిటల్ రోడ్డుకు ప్రయాణ దూరం 2.5 కిలోమీటర్లు తగ్గుతుంది. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం కోసం విస్తృత కృషిలో భాగంగానే ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.