
ముంబై: కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారంపై బ్యాంకింగ్ మరింత దృష్టి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ‘‘ఖాతాదారుల సముపార్జనను బ్యాంకులకు తీసుకురావడానికి బ్యాంకులు తీవ్రంగా దృష్టి పెట్టాయి. అయితే కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు’’ అని 2023 ఫిక్కీ బ్యాంకింగ్ వార్షిక సమావేశంలో (ఎఫ్‌ఐబీఏసీ) కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్– ఐబీఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ– ఫిక్కీ ఇక్కడ బుధవారం నుంచి నిర్వహించిన రెండు రోజుల ముగింపు సమావేశంలో రాజేశ్వరావు మాట్లాడారు. ఎఫ్‌ఐబీఏసీ 2023లో గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం ప్రారంభోపన్యాసం చేసిన సంగతి తెలిసిందే.
‘‘అనిశ్చితి సమయాల్లో గెలుపు’’ అన్న అంశంపై ప్రధానంగా జరిగిన ఈ సమావేశాల్లో గురువారం డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర రావు ఏమన్నారంటే.... దురదృష్టవశాత్తూ, కస్టమర్ ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారాలను అందించడానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా లేవు. ముఖ్యంగా పెరుగుతున్న సాంకేతికత, ఇన్‌స్ట్రమెంట్ల స్థాయిల్లో కస్టమర్ సేవలు ఉండడం లేదు. సేవా పరిశ్రమగా గర్వించే రంగంలో ఈ తరహా పరిస్థితి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బ్యాంకుల బోర్డులు ఈ విషయంపైతీవ్రగా ఆలోచన చేయాలి.
కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. టెక్ బ్యాంకింగ్ వాతావరణంలో సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయడం, సైబర్ మోసాలను నిరోధించడంపై కూడా బ్యాంకులు మరింత దృష్టి సారించాలి. వినియోగదారుని మోసగించడానికి చేసే చర్యలను పటిష్టంగా అరికట్టగలగాలి. ఆయా సమస్యల పరిష్కారం దిశలో మనం మరింత కష్టపడి పని చేయాలి. తెలివిగా పని చేయాలి. కస్టమర్‌ల నమ్మకాన్ని నిలుపుకోవడానికి, బ్యాంకింగ్‌ను బలోపేతం చేయడానికి, డిజిటల్ సెక్యూరిటీకి సంబంధించిన బెదిరింపుల నుండి కస్టమర్‌ను రక్షించడానికి మనం కలిసి పని చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment