
క్యూ1లో రూ. 5,806 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 3 శాతం నీరసించి రూ. 6,244 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్ నికర లాభం సైతం 4 శాతం క్షీణించి రూ. 5,806 కోట్లకు పరిమితమైంది.
మొండి బకాయిలు, లోన్ అప్‌గ్రేడ్ విధానాలలో మార్పులు మొత్తం ఫలితాలపై ప్రభావం చూపినట్లు బ్యాంక్ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,034 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 35,844 కోట్ల నుంచి రూ. 38,322 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం రూ. 30,061 కోట్ల నుంచి రూ. 31,064 కోట్లకు పుంజుకుంది. నికర వడ్డీ ఆదాయం 1 శాతం నామమాత్ర వృద్ధితో రూ. 13,560 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.05 శాతం నుంచి 3.8 శాతానికి నీరసించాయి.
ఎన్‌పీఏలు పెరిగాయ్..
క్యూ1లో యాక్సిస్ బ్యాంక్ నిర్వహణ లాభం రూ. 10,106 కోట్ల నుంచి రూ. 11,515 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.28 శాతం నుంచి 1.57 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.34 శాతం నుంచి 0.45 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 2,039 కోట్ల నుంచి రూ. 3,948 కోట్లకు భారీగా ఎగశాయి. స్థూల స్లిప్పేజీలు రూ. 4,805 కోట్ల నుంచి రూ. 8,200 కోట్లకు భారీగా పెరిగాయి. అయితే టెక్నికల్ ప్రభావాన్ని సర్దుబాటు చేస్తే రూ. 5,491 కోట్లుగా నమోదైనట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ పేర్కొన్నారు. కనీస మూలధన నిష్పత్తి 17.07 శాతం నుంచి 16.85 శాతానికి నీరసించింది.
ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 1,160 వద్ద ముగిసింది.