నష్టాల ఊబిలో ఏవియేషన్‌

Aviation Industry may incur loss up to Rs 42,000 crore in two years - Sakshi

2021–22లో రూ.26,000 కోట్లు

2022–23లో రూ.16,000 కోట్లు

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా

ముంబై: విమానయాన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనూ భారీ నష్టాలు తప్పవని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. రూ.25,000–26,000 కోట్ల మేర నష్టాలను నమోదు చేయవచ్చంటూ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జెట్‌ ఇంధన ధరలు (ఏటీఎఫ్‌) పెరిగిపోవడం, టికెట్‌ చార్జీలపై పరిమితులు కంపెనీలకు ప్రతికూల అంశాలుగా తెలిపింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నష్టాలు రూ.14,000–16,000 కోట్లకు తగ్గుతాయని అంచనా వేసింది. 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య పరిశ్రమకు అదనంగా రూ.20,000–22,000 కోట్ల వరకు నిధుల అవసరం ఉంటుందని తెలిపింది.

పెరిగిన రద్దీ
దేశీయ ప్రయాణికుల రద్దీ వార్షికంగా చూస్తే 2021–22లో 50–55 శాతం మేర వృద్ధి చెందుతుందని ఇక్రా పేర్కొంది. టీకాలు ఎక్కువ మందికి ఇవ్వడం, ఆంక్షలు సడలిపోవడం అనుకూలించే అంశాలని తెలిపింది. అయినప్పటికీ కరోనా ముందస్తు గణాంకాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. 2023–24 సంవత్సరంలోనే కరోనా ముందున్న స్థాయికి విమాన ప్రయాణికుల రద్దీ చేరుకుంటుందని పేర్కొంది. కరోనా రెండో విడత తీవ్రంగా ఉండడం, ఆ వెంటే ఒమిక్రాన్‌ వెలుగు చూడడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదల నిదానంగా ఉన్నట్టు వివరించింది.  

వ్యయాల భారం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఏటీఎఫ్‌ సగటు ధరలను పరిశీలించినప్పుడు, గతేడాదితో పోలిస్తే 68 శాతం పెరిగాయని.. అదే సమయంలో టికెట్‌ చార్జీలపై పరిమితులు నష్టాలకు దారితీస్తున్నట్టు ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ సుప్రియో బెనర్జీ తెలిపారు. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు త్వరలో అనుమతిస్తుండడం, ఒమిక్రాన్‌ తగ్గిపోవడంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో ప్రయాణికుల రద్దీ పుంజుకుంటుందని ఇక్రా తెలిపింది. ఎయిర్‌లైన్స్‌ రుణ భారం తక్కువగా ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నికర నష్టాలు తగ్గేందుకు సాయపడుతుందని పేర్కొంది.

ఉక్రెయిన్‌–రష్యా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో 2022–23 సంవత్సరంలో ఏటీఎఫ్‌ కోసం ఎయిర్‌లైన్స్‌ అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎయిర్‌ ఇండియా విక్రయానికి ముందు రుణ భారం గణనీయంగా తగ్గించుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత ఏవియేషన్‌ పరిశ్రమపై నెగెటివ్‌ అవుట్‌లుక్‌ (ప్రతికూల దృక్పథం)ను కొనసాగిస్తున్నట్టు ఇక్రా ప్రకటించింది. పనితీరును మెరుగుపరుచుకోవడం, రుణభారాన్ని తగ్గించుకునే వరకు భారత ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిళ్లు కొనసాగుతాయని తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top