
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహీంద్రా ఆటోమొబైల్స్, కర్నాటక రైతు కెంపెగౌడల మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. సేల్స్‌మన్ అనుచిత ప్రవర్తనతో అవమానికి గురైన రైతుకి ఏకంగా మహీంద్రా గ్రూపు సీఈవో నుంచి ఆహ్వానం అందింది.
డ్యామేజ్ కంట్రోల్
రైతును అవమానించిన ఘటనతో మహీంద్రా గ్రూపుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. వెంటనే మహీంద్రా రైస్ గ్రూపుతో పాటు ఆ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇది మా పాలసీ కాదంటూ స్పందించారు. ఈ చర్యకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయంటూ ప్రకటించారు. ఐపన్పటికీ ఈ వివాదం సోషల్ మీడియాలో రగులుతూనే ఉంది. మహీంద్రాపై ట్రోల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు చేపట్టింది మహీంద్రా రైజ్.
వెల్‌కమ్ టూ మహీంద్రా
2022 జనవరి 21న కెంపెగౌడకి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తాజాగా ప్రకటించింది మహీంద్రా రైజ్. జరిగిన ఘటనపై తగు చర్యలు తీసుకున్నామని, సమస్య సమసిపోయిందని తెలిపింది. మహీంద్రా వాహనం కొనుగోలు చేయాలనుకున్నందుకు కెంపెగౌడకు కృతజ్ఞతలు తెలిపింది. వివాదం సమసిపోయినందున మహీంద్రా వాహనం కొనాలంటూ కెంపెగౌడని కోరుతూ ట్వీట్ చేసింది. దీన్ని రీట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. మహీంద్రా ఫ్యామిలీలో చేరాలంటూ కెంపెగౌడకి వెల్‌కమ్ చెప్పారు. అయితే ఇంతటి వివాదానికి కారణమైన సేల్స్‌మన్‌పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారనే అంశాలను మహీంద్రా గ్రూపు స్పష్టంగా ప్రకటించలేదు.
ఇదీ వివాదం
కెంపెగౌడ అనే రైతు కారు కొనేందుకు కర్నాటకలోనిన తుముకూరులో ఉన్న మహీంద్రా షోరూమ్‌కి వెళ్లగా.. నీకు కారు కొనే స్థోమత లేదంటూ సేల్స్‌మాన్ అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో గంట వ్యవధిలోనే రూ.10 లక్షలతో వచ్చిన సదరు రైతు ఇప్పటికిప్పుడు వాహానం డెలివరీ చేస్తారా? అంటూ సవాల్ విసిరాడు. డెలివరీ చేయలేమంటూ షోరూం సిబ్బంది చెప్పారు. మహీంద్రా వాహనం కొనాలని ఇక్కడకు వచ్చానని, కానీ తనకు జరిగిన అవమానంతో వేరే కంపెనీ వాహనం కొంటాను అంటూ వెళ్లిపోయాడు కెంపెగౌడ. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
చదవండి: Mahindra Showroom: రైతు ప్రతీకారం అదిరింది.. సినిమాలోని ట్విస్ట్ మాదిరిగా ఉంది