
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా తమ ఆశ్రయ్ ప్రాజెక్టును మరింతగా విస్తరించింది. ప్రభుత్వ రంగ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)తో కలిసి మరో 40 కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో వీటి సంఖ్య 13 నగరాలవ్యాప్తంగా 65కి చేరింది. 2025 ఆఖరు నాటికి ఇలాంటి 100 సెంటర్స్ ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు అమెజాన్ ఆపరేషన్స్ డైరెక్టర్ (ఇండియా) సలీం మెమన్ తెలిపారు.
పెట్రోల్ బంకులు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ఈ సెంటర్స్.. అమెజాన్ సొంత నెట్‌వర్క్‌లోని వారితో పాటు ఈ–కామర్స్, లాజిస్టిక్స్ వ్యవస్థలోని ఇతరత్రా డెలివరీ అసోసియేట్స్ కూడా కాసేపు సేద తీరేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఎయిర్ కండీషన్డ్ సీటింగ్, తాగు నీరు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, వాష్‌రూమ్‌లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మొదలైనవి ఉంటాయి. ఉదయం 9 గం.ల నుంచి రాత్రి 9 గం.ల వరకు, ఏడాదిపాడవునా, వారానికి ఏడు రోజులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ మార్పులతో ఇబ్బందిపడే డెలివరీ అసోసియేట్స్ ప్రతి విజిట్‌లో అరగంట సేపు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇదీ చదవండి: బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు