
రిస్క్ మేనేజ్‌మెంట్‌ని పటిష్టం చేసుకోవాలి
ఫిన్‌టెక్ సంస్థలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన
ముంబై: ప్రజలను మోసగించేందుకు నేరగాళ్లు కృత్రిమ మేధను (ఏఐ) ఉపయోగించి క్లోనింగ్, ఫేక్ వీడియోల్లాంటివి సృష్టిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని ఫిన్‌టెక్ సంస్థలకు సూచించారు. 6వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. వివిధ రకాల ఏఐ ఉత్పత్తులు, సరీ్వసులను రూపొందించే విషయంలో గ్లోబల్ హబ్‌గా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని మంత్రి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అవసరాలకు ఉపయోగపడే ఏఐ ఉత్పత్తులను సృష్టించగలదని, ఏఐ ఐడియాలను అభివృద్ధి చేసేందుకు, ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ప్రయోగశాలగా కూడా ఉండగలదని ఆమె పేర్కొన్నారు. ఏఐ చీకటి కోణం..: ఏఐతో ఆర్థిక రంగం, గవర్నెన్స్‌లో సానుకూల మార్పులు వచి్చనప్పటికీ, ఈ టెక్నాలజీలో చీకటి కోణం కూడా ఉందని ఆమె చెప్పారు. ‘ఏఐతో అసాధారణ అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో అది దుర్వినియోగం కాకుండా కూడా మనం కట్టడి చేయాలి.
కొత్త ఆవిష్కరణలకు దన్నుగా నిల్చే సాధనాలే మోసాలు చేసేందుకు ఆయుధాలుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేలా, వాస్తవాలను కప్పిపుచ్చేలా తయారు చేసిన నా డీప్‌ఫేక్ వీడియోలు ఎన్నో ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతుండటాన్ని నేను స్వయంగా చూశాను. ఇలాంటి వాటిని తక్షణం ఎదుర్కొనేందుకు మన వ్యవస్థలను తక్షణం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని చెప్పారు.
ఆర్థిక సాధికారతకు ఫిన్‌టెక్ దన్ను..
ఫిన్‌టెక్ అనేది ఏదో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన సౌకర్యం కాదని, దేశవ్యాప్తంగా ఆర్థిక సాధికారతకు ఉపయోగపడే సాంకేతికతని మంత్రి చెప్పారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో రోజువారీ జరిపే చెల్లింపుల తీరుతెన్నులను ఇది మార్చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు సగభాగం రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలు భారత్‌లో జరుగుతున్నాయని తెలిపారు. ‘మనం ఆర్థికంగా ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం, దాన్ని ఎలా సాధించదల్చుకుంటున్నాం అనేది ఆలోచించుకునేందుకు ఇది సరైన తరుణం. ఆదాయ వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, లాభదాయకత, రిస్క్ సామర్థ్యాలు మొదలైన ప్రాథమికాంశాలపై ఫిన్‌టెక్‌లు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని వివరించారు.
బయోమెట్రిక్‌తో యూపీఐ చెల్లింపులు..
ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ)కి సంబంధించిన పలు సొల్యూషన్స్‌ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆవిష్కరించింది. ప్రస్తుతం డివైజ్‌లో యూపీఐ లావాదేవీ ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్న పిన్ నంబరు స్థానంలో, బయోమెట్రిక్ విధానాన్ని (వేలి ముద్ర, ఫేస్ అన్‌లాక్) వాడేందుకు ఉపయోగపడే టెక్నాలజీని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు ప్రవేశపెట్టారు.
ఏటీఎంలలో నగదు విత్‌డ్రాయల్‌తో పాటు యూపీఐ పిన్‌ను సెట్ చేసేందుకు లేదా రీసెట్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కొత్త యూజర్లు, సీనియర్ సిటిజన్లను కూడా యూపీఐ చెల్లింపుల పరిధిలోకి చేర్చేందుకు ఇది తోడ్పడుతుందని ఎన్‌పీసీఐ వివరించింది. అలాగే యూపీఐ క్యాష్ పాయింట్లలో యూపీఐని ఉపయోగించి నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.
యూపీఐ లైట్ ద్వారా వేరబుల్ స్మార్ట్‌గ్లాసెస్‌తో కూడా చెల్లింపులు జరిపే సొల్యూషన్‌ని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ ఆవిష్కరించారు. ఫోన్‌తో పని లేకుండా, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్‌ని స్మార్ట్ కళ్లద్దాలతో స్కాన్ చేసి, వాయిస్ కమాండ్‌తో పేమెంట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు అవసరమయ్యే రోజువారీ కొనుగోళ్లకు ఇది ఉపయోగకరం. ఇక జాయింట్ అకౌంట్ హోల్డర్లు కూడా చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించే సదుపాయాన్ని ఆవిష్కరించింది. అటు ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌తో జట్టు కట్టినట్లు పేపాల్ ప్రకటించింది.