భారత్‌ వృద్ధికి సంస్కరణల ఊతం

Accelerated implementation of reforms to accelerate India growth - Sakshi

ప్రపంచ బ్యాంక్‌ విశ్లేషణ

ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళన

2030 నాటికి మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోతుందని అంచనా  

న్యూఢిల్లీ: భారత్‌ ఇప్పటికే  అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్కరణల ఎజెండాను మరింత వేగవంతంగా అమలు చేయడం వల్ల దేశ వృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ తాజా నివేదిక  పేర్కొంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రతికూలతకు దారితీసిందని బహుళజాతి బ్యాంకింగ్‌ దిగ్గజం స్పష్టం చేసింది. ఆయా పరిస్థితులు ఎకానమీ పురోగతికి సంబంధించి ప్రపంచం ఒక ‘దశాబ్దాన్ని’ కోల్పోయే పరిస్థితిని సృష్టిస్తున్నాయని హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక పురోగతి మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది.

2000–2010 మధ్య ప్రపంచ స్థూల వృద్ధి రేటు దాదాపు 6.5 శాతం ఉంటే, 2020–30 మధ్య కాలానికి ఈ రేటు 2.2 శాతానికి పడిపోవచ్చని తెలిపింది.  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే, ఎకానమీ క్షీణత 2000– 2010 మధ్య సంవత్సరానికి సగటున 6 శాతం ఉంటే,  ఈ దశాబ్దంలో మిగిలిన కాలంలో సంవత్సరానికి 4 శాతానికి పడిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం– మాంద్యం పరిస్థితులు తలెత్తితే ఈ పతనం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.  ‘దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు తిరోగమనం–పోకడలు, అంచనాలు–విధానాల’ పేరుతో విడుదలైన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు.

► భారత్‌ తోటి దేశాల కంటే వేగవంతమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ, సంస్కరణ ఎజెండాను ముఖ్యంగా తయారీ, మౌలిక రంగంలో వేగవంతంగా అమలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ రంగంలో ఒత్తిడులను తొలగించాల్సి ఉంది. ఈ విభాగంలో సవాళ్లు దేశ పురోగతికి బ్రేకులు వేస్తున్నాయి.  
► 2000–10లో భారత్‌ పెట్టుబడుల సగటు వార్షిక వృద్ధి 10.5 శాతం అయితే, 2011–21లో ఈ రేటు 5.7 శాతానికి పడిపోయింది.  
► విద్యుత్, రోడ్డు, రైలు నెట్‌వర్క్, వ్యాపారాలకు ఎదురవుతున్న అవరోధాలు, బ్యాంకింగ్‌ రంగంలో మొండిబకాయిల వంటి బలహీనతలు వంటి అంశాలు భారత్‌ ఎకానమీకి అవరోధాలుగా ఉన్నాయి.  
► కోవిడ్‌–19తో ఎదురవుతున్న పరిణామాలు ప్రపంచ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.  
► భౌగోళిక ఉద్రిక్తతలూ ప్రపంచ వృద్ధి తిరోగమనానికి దారితీస్తున్నాయి.  
► పెట్టుబడుల్లో వృద్ధి క్షీణిస్తోంది. ప్రపంచ శ్రామిక శక్తి మందకొడిగా పెరుగుతోంది.  కరోనావైరస్‌ మహమ్మారి వల్ల మానవ వనరుల నైపుణ్య కొరత ఎదురవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో
వృద్ధి.. జీడీపీ పురోగతికి తగిన విధంగా సరిపోవడం లేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top