న్యూఢిల్లీ: జీఎస్టీ నమోదుకై ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణను ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన సెంట్రల్, స్టేట్ జీఎస్టీ అధికారుల మూడవ జాతీయ సమన్వయ సమావేశంలో బయోమెట్రిక్ ఆధారిత ధ్రువీకరణపై చర్చించారు. జీఎస్టీ నమోదు కోసం ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణను అమలు చేయడానికి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు సైతం ఆసక్తి చూపుతున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.
ఈ విధానం అమలుకు అయ్యే ఖర్చు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అవసరాన్ని ఈ రాష్ట్రాలు అంచనా వేయాలని అనుకుంటున్నాయని తెలిపారు. అందుకు కావాల్సిన సమాచారం అందించామని, మూల్యాంకనం ఆధారంగా ఈ రాష్ట్రాలు ఆమోదం కోసం రాష్ట్ర క్యాబినెట్ ముందు ప్రతిపాదనను ఉంచాల్సి ఉంటుందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌లో భాగంగా దరఖాస్తుదారుల గుర్తింపును నిర్ధారించడానికి ఓటీపీ ఆధారిత ఆధార్ ధ్రువీకరణను ఉపయోగిస్తున్నారు.
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం బూటకపు సంస్థలను సృష్టించడం ద్వారా ఇతరుల గుర్తింపును దుర్వినియోగం చేసిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) బయోమెట్రిక్ ప్రామాణీకరణ అమలు చేయాలని నిర్ణయించింది. కొన్ని అనుమానాస్పద సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కోరుకునే వ్యక్తిని బయోమెట్రిక్‌లను ధృవీకరించుకోవడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment