ప్రైవేట్‌ లేబుల్స్‌కి జై... | 52percent consumers are switching to private labels says EY report | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ లేబుల్స్‌కి జై...

May 22 2025 4:48 AM | Updated on May 22 2025 6:07 AM

52percent consumers are switching to private labels says EY report

వినియోగదారుల్లో సగం మంది మొగ్గు 

సొంత బ్రాండ్‌ ఉత్పత్తులకు ప్రాచుర్యం

ఈవై సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయంగా వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రైవేట్‌ లేబుల్స్‌ వైపు మళ్లే వారు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం దాదాపు సగం మంది వినియోగదారులు ఇలా మొగ్గు చూపుతున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఒక సర్వే నివేదికలో తెలిపింది. ఈవై రూపొందించిన ఫ్యూచర్‌ కన్జూమర్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌సీఐ) ఇండియా నివేదిక ప్రకారం సంప్రదాయ బ్రాండెడ్‌ ఉత్పత్తుల స్థానంలో స్టోర్ల సొంత బ్రాండ్లకు ప్రాచుర్యం పెరుగుతోంది. 

52% మంది వినియోగదారులు ప్రైవేట్‌ లేబుల్స్‌కు మారారు. ప్రైవేట్‌ లేబుల్‌ బ్రాండ్లు మంచి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాయని విశ్వసిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 70% మంది తెలిపారు. అలాగే, బ్రాండెడ్‌ ఉత్పత్తులతో సరిసమానంగా ప్రైవేట్‌ లేబుల్స్‌ ప్రోడక్టులు తమ అవసరాలను తీర్చే విధంగా ఉంటున్నాయని భావిస్తున్నట్లు 70% మంది వినియోగదారులు పేర్కొన్నారు. 

ముడి సరుకులను లేదా ఫార్ములాను మార్చి, ఉత్పత్తిని మెరుగుపర్చి, వినూత్నంగా అందించేందుకు బ్రాండ్లు ప్రయత్నిస్తున్నా.. ఇవన్నీ నిఖార్సయిన ఆవిష్కరణలు కావని, కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రమేనని 34% మంది భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా వినియోగదారుల ధోరణులు మారడం సాధారణమే అయినా, ప్రస్తుత మార్పులు శాశ్వత ప్రాతిపదికన కొనసాగేలా కనిపిస్తోందని ఈవై–పారీ్థనన్‌ పార్ట్‌నర్‌ అంగ్షుమన్‌ భట్టాచార్య చెప్పారు.

నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు.. 
→ బ్రాండ్‌కు కట్టుబడి ఉండటం కన్నా డిస్కౌంట్లకే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సేల్‌ పెట్టినప్పుడు మాత్రమే పెద్ద బ్రాండ్లను కొంటున్నామని 59 % మంది తెలిపారు.  

→ రిటైల్‌ స్టోర్స్‌లో కూడా ప్రైవేట్‌ లేబుల్స్‌కి ప్రాధాన్యత పెరుగుతోంది. తాము షాపింగ్‌ చేసే చోట మరిన్ని ప్రైవేట్‌ లేబుల్‌ ఆప్షన్లు కనిపిస్తున్నట్లు 74 శాతం మంది చెప్పారు. స్టోర్లలోని షెల్ఫుల్లో సరిగ్గా కంటికి కనిపించే స్థాయిలో మరిన్ని ప్రైవేట్‌ లేబుల్‌ ఉత్పత్తులను డిస్‌ప్లే చేస్తున్నట్లు గమనించామని 70 శాతం మంది వివరించారు. స్టోర్ల సొంత బ్రాండ్లు, ప్రైవేట్‌ లేబుల్స్‌తో డబ్బు ఆదా అవుతోందని 69 శాతం మంది 
వినియోగదారులు చెప్పారు. 

→ రిటైలర్లు మరింత ధీమాగా ప్రైవేట్‌ లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రధానమైన ప్రైమ్‌ షెల్ఫ్‌ స్పేస్‌ కూడా ఇస్తున్నారు. అలాగే, వినియోగదారులకు అపరిమిత ఆప్షన్లను, టెక్నాలజీతో ఇతర ఉత్పత్తులతో పోల్చి చూసుకునే వెసులుబాట్లను కలి్పస్తూ మెరుగైన షాపింగ్‌ అనుభూతిని అందిస్తున్నారు.  

→ తాజా, కొత్త బ్రాండ్లకు భారత వినియోగదారుల్లో ప్రాచుర్యం పెరుగుతుండటాన్ని ప్రైవేట్‌ లేబుల్స్‌ వేగవంతమైన వృద్ధి సూచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలతో వారికి మరింతగా చేరువయ్యేందుకు పెద్ద బ్రాండ్లు దృష్టి పెట్టాల్సిన అవసరం నెలకొంది. 

→ అత్యుత్తమమైన రుచి, నాణ్యత లేదా పని తీరును అందిస్తే తిరిగి బ్రాండెడ్‌ ఉత్పత్తికి మళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని 47 శాతం మంది తెలిపారు. కట్టే డబ్బుకు మరింత మెరుగైన విలువను పొందడం కోసం తాము మళ్లీ బ్రాండెడ్‌ ఉత్పత్తులకు మళ్లే అవకాశం ఉందంటూ 44 శాతం మంది సూచనప్రాయంగా తెలిపారు. 

→ కృత్రిమ మేధ(ఏఐ) కీలకమైన షాపింగ్‌ సాధనంగా మారింది. ఏఐ సిఫార్సుల ఆధారంగా తాము కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు 62 శాతం మంది చెప్పారు. తమ షాపింగ్‌ అనుభూతిని ఏఐ మరింత మెరుగుపర్చిందంటూ 58 శాతం మంది వినియోగదారులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement