5 Investment Lessons From Warren Buffett Playbook, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Warren Buffett Investment Lessons: ఈక్విటీల్లో విజయానికి.. బఫెట్‌ పంచ సూత్రాలు

Published Mon, Mar 14 2022 1:04 AM

5 Investment Lessons From Warren Buffett Playbook - Sakshi

2020 నుంచి రెండేళ్లపాటు తారాజువ్వలా సాగిన ఈక్విటీల ర్యాలీ చూసి మార్కెట్లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన యువ ఇన్వెస్టర్లు బోలెడు మంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు వారిని ఇప్పుడు అయోమయానికి గురిచేయవచ్చు. అంతెందుకు సుదీర్ఘకాలం నుంచి మార్కెట్లో ఉన్న వారు సైతం షేర్ల ధరలు పేకమేడల్లా రాలుతున్నప్పుడు స్థిరంగా చూస్తూ ఉండలేరు. నష్టానికైనా అమ్ముకుని బయటపడదామనుకుంటారు.

కానీ, ఈక్విటీ మార్కెట్లకు సంక్షోభాలు కొత్త కాదు కదా! ఎన్నో స్కాములు, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలను చూసి పడిపోయాయి. అంతే బలంగా పైకి లేచి నిలబడ్డాయి. ఈక్విటీల్లో విజయానికి ముందుగా కావాల్సింది పెట్టుబడి కాదు. విజయ సూత్రాలు. వారెన్‌ బఫెట్‌ వంటి విఖ్యాత ఇన్వెస్టర్ల అనుభవాలు, సూత్రాలు లోతుగా పరిశీలిస్తే ఈక్విటీ తత్వం కొంతైనా బోధపడుతుంది. వారెన్‌ బఫెట్‌ పెట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్‌ హాతవే 1970 నుంచి ఏటా వాటాదారులకు వార్షిక నివేదిక పంపిస్తుంటుంది. ఇందులో వాటాదారులను ఉద్దేశించి బఫెట్‌ రాసే లేఖ ఇన్వెస్టర్లకు ఒక చుక్కానిలా పనిచేస్తుంది. బఫెట్‌ అనుసరించిన సూత్రాలు కాల పరీక్షకు నిలబడినవి.
 
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కరోనా విపత్తు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక ఆంక్షలు, చైనాలో మందగమనం, అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల శరాఘాతం, దీర్ఘకాలం పాటు ఆర్థిక స్తబ్దత, రూపాయి బలహీనత ఇలా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఒకవైపు వృద్ధికి ప్రోత్సాహం కావాలి. మరోవైపు ధరలకు కట్టడి వేయాలి. సెంట్రల్‌ బ్యాంకులకు ఇదొక సవాలుగా మారిపోయింది. ధరల పెరుగుదలకు సరఫరా వ్యవస్థలో సమస్యలూ తోడయ్యాయి. ఇలా ఒకటికి మించిన ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు గురిచేస్తున్నాయి. స్వల్పకాలంలో కనిపించే ఇలాంటి ప్రకంపనలకు కదిలిపోతే దీర్ఘకాలం పాటు మార్కెట్లో నిలిచి రాణించడం అసాధ్యం.  

ద్రవ్యోల్బణం ప్రభావం
ద్రవ్యోల్బణం ఎగసిపడడం అన్నది తాత్కాలికమేనన్న వాదన గతేడాది నుంచి వినిపిస్తోంది. కానీ, ఇది నిజం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా తక్కువ ద్రవ్యోల్బణం ఉంది. ఫలితంగా దీర్ఘకాలం పాటు సరళతర విధానాలు కొనసాగడం వల్ల ఉండే రిస్క్‌ను ఇన్వెస్టర్లు, విశ్లేషకులు, ఆర్థికవేత్తలు సైతం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కానీ, ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం నడుమ సెంట్రల్‌ బ్యాంకుల ముందున్న ఏకైక మార్గం ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేయడమే. ఇన్నాళ్లూ తక్కువ వడ్డీ రేట్లు, మిక్కిలి ద్రవ్య లభ్యతతో లాభపడిన మార్కెట్లు.. పరిస్థితులకు తగ్గట్టు మార్పునకూ గురి కావాల్సిందే. వడ్డీ రేట్లు పెరగడం స్టాక్స్‌కు ప్రతికూలమే. ద్రవ్యోల్బణాన్ని బఫెట్‌ టేప్‌వార్మ్‌తో పోల్చారు. టేప్‌వార్మ్‌లు పేగుల లోపలి గోడల్లో ఉండి మనం తీసుకునే ఆహారంలోని శక్తిని గ్రహిస్తుంటాయి. అలాగే, ద్రవ్యోల్బణం కంపెనీల నిధుల శక్తిని హరిస్తుంటుంది. రుణాలను భారంగా మారుస్తుంది.

అధిక ద్రవ్యోల్బణం తర్వాత కనిపించేది అధిక వడ్డీ రేట్లే. అందుకుని మార్కెట్లు ఖరీదుగా మారినప్పుడు, వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మిగులు నిధులను బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తానని బఫెట్‌ తన 1986 లేఖలో పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరిగితే టేప్‌వార్మ్‌ మాదిరిగా ఏ స్టాక్స్‌ విలువలు హరించుకుపోతాయన్న విశ్లేషణ చేయాలి. కమోడిటీలు ఇన్‌పుట్‌గా (ముడి సరుకులుగా) వ్యాపారం చేసేవి, అధిక రుణభారంతో నడిచే కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అప్పటి వరకు రుణాల అండతో ఇన్‌ఫ్రా, పవర్‌ కంపెనీలు దూకుడు ప్రదర్శించగా.. ఆ తర్వాత కుదేలయ్యాయి. రుణాలు తీర్చలేక ఎన్నో కనుమరుగయ్యాయి. పెన్నీ షేర్లుగా మారిపోయినవీ ఉన్నాయి. వడ్డీ రేట్ల సైకిల్‌ మారే దశలో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే, నష్టాలతో వచ్చే న్యూఏజ్‌ కంపెనీలపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపిస్తాయి.

భద్రత పాళ్లు ఎంత?
1991, 1993 వార్షిక లేఖల్లో బఫెట్‌ ‘మార్జిన్‌ ఆఫ్‌ సేఫ్టీ’ (భద్రత) గురించి ప్రస్తావించారు. పెట్టుబడి విజయంలో దీని పాత్ర ఎంతో ఉంటుందన్నది ఆయన అనుభవ సారం. స్టాక్స్‌ విలువను మదింపు వేసే విషయంలో ఊహించిన, ఊహించని రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాలకు దారితీస్తుంది. వచ్చే పదేళ్ల పాటు మార్కెట్లలో సానుకూల పరిస్థితులు ఉంటాయని వినడా నికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవంలో ఇది సాధ్యమేనా? ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, కంపెనీలకు సంబంధించి రిస్క్‌లు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. లాభాల్లేకుండా ఏటా మార్కెట్‌ వాటా పెంపు కోసం నష్టాలను అధికం చేసుకుంటూ వెళ్లే కంపెనీలకు సంబంధించి భవిష్యత్తు అంచనాలు ఎంతో ఆకర్షణీయంగానే ఉంటాయి.

కానీ, ఆర్జించే ఆదాయానికి 3,000 రెట్లు ధర పలుకుతున్న ఆయా కంపెనీల్లో మీరు పెట్టే పెట్టుబడికి భద్రత పాళ్లు ఎంత? ఎన్నో రేట్ల అధిక స్పందన అందుకున్న ఇటీవలి జొమాటో, పేటీఎం, నైకా, పీబీ ఫిన్‌టెక్, కార్‌ట్రేడ్‌ షేర్లు.. లిస్ట్‌ అయిన తర్వాత గరిష్టాల నుంచి చూస్తే 40–70 శాతం స్థాయిలో పడిపోయాయి. కానీ, ద్రవ్యోల్బణం ప్రభావం వీటిపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. జొమాటో రూ.76 ధరకు ఐపీవో తీసుకురాగా, ఆ తర్వాత రూ.179 వరకు వెళ్లింది. ఇప్పడు రూ.79 వద్ద ట్రేడవుతోంది. విలువను సరిగ్గా అంచనా కట్టకుండా రూ.150–179 మధ్య పెట్టుబడులు పెట్టిన వారి స్థితి ఏంటి? వారు మార్జిన్‌ ఆఫ్‌ సేఫ్టీని పట్టించుకోలేదన్నది స్పష్టం.

స్పెక్యులేషన్‌కు దూరం
దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలంటే స్పెక్యులేటర్‌గా ఉండకూడదని బఫెట్‌ చెబుతారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్‌ వేర్వేరు. ఈ రెండింటి మధ్య విభజన గీత స్పష్టంగా ఉంచుకోవాల్సిందే. ఫలానా షేరు ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలో, ర్యాలీ చేస్తుండడమే మీ పెట్టుబడి వెనుక కారణం అయి ఉంటే, షేరు ధర కంపెనీ మూలాలను ప్రతిఫలించడం లేదంటే అది స్పెక్యులేషన్‌ అవుతుంది. అయినా కానీ, లాభాలు రావచ్చు. మన దేశంలో కొన్ని పాపులర్‌ స్టాక్స్‌ కొన్నేళ్ల పాటు అసాధారణ వ్యాల్యూషన్లతోనే ట్రేడవుతుంటాయి.

కానీ,  ఒక్కసారిగా ఆయా కంపెనీల్లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటే ఈ వ్యాల్యూషన్లు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఉదాహరణకు పెయింట్స్‌ స్టాక్స్‌ ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలోనే, అంతర్గత విలువకుపైనే ట్రేడవుతుంటాయి. కానీ, చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు వాటి ధరలు దిగొస్తున్నాయి. చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగితే పెయింట్స్‌ స్టాక్స్‌ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వృద్ధి అవకాశాలూ సన్నగిల్లుతాయి. ఎందుకంటే ఆయా కంపెనీలు ధరలను పెంచితే విక్రయాలపై ప్రభావం పడుతుంది. అం దుకని పెట్టుబడికి స్పెక్యులేషన్‌ ధోరణి పనికిరాదు.  

అంతర్గత విలువ
కంపెనీకి ఫలానా ధర పెట్టొచ్చా అన్నది ఎలా తెలుస్తుంది? దీనికి అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్‌ వ్యాల్యూ) చూడడం బఫెట్‌ అనుసరించే సూత్రాల్లో మరొకటి. బెర్క్‌షైర్‌ వాటాదారులకు బఫెట్‌ తరచుగా దీన్ని సూచిస్తుంటారు కూడా. కంపెనీ వ్యాపారం నుంచి తీసుకోతగిన ‘డిస్కౌంటెడ్‌ క్యాష్‌ వ్యాల్యూ’ను అంతర్గత విలువగా బఫెట్‌ చెబుతారు. కానీ పెట్టుబడుల నిపుణులకు సైతం ఇది కొరుకుపడని అంశం. ఇందుకు సంబంధించి ఎవరికి వారు తమదైన లెక్కింపు విధానాలను అనుసరిస్తుంటారు. కంపెనీకి సంబంధించి నికర పుస్తక విలువను అంచనా వేసి, దానికి సమీప భవిష్యత్తులో వచ్చే క్యాష్‌ ఫ్లో, ప్రస్తుత లాభాలను కలిపితే అంతర్గత విలువ వస్తుంది. ఇవన్నీ కష్టంగా అనిపించిన వారు.. కంపెనీ లాభాలు ఆ కంపెనీ గత చరిత్ర సగటు స్థాయిలోనే ఉన్నాయా? అని చూడాలి.

తర్వాత స్టాక్‌ ధర చారిత్రకంగా (గతంతో పోలిస్తే) సగటు వ్యాల్యూషన్ల స్థాయిలోనే ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా? గమనించాలి. ఒకవేళ స్టాక్‌ ధర చారిత్రక సగటు వ్యాల్యూషన్లకు ఎగువన ట్రేడ్‌ అవుతుంటే అంతర్గత విలువకు మించి ట్రేడవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీల లాభాల వృద్ధి కంటే వాటి స్టాక్స్‌ వ్యాల్యూషన్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో అవి అంతర్గత విలువను దాటిపోయి ట్రేడవుతున్నాయి. 2011 నుంచి 2021 వరకు నిఫ్టీ–50 ఇండెక్స్‌ 275 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఈ మొత్తంలో 170 శాతం రాబడులు పీఈ రేషియో పెరగడం రూపంలోనే వచ్చాయి. కానీ, ఫండమెంటల్స్‌ మెరుగుపడడం వల్ల కాదు. అదంతా బబుల్‌గానే భావించాల్సి ఉంటుంది. పెరుగుదల వెనుక వాస్తవ బలం 100 శాతంగానే భావించాలి. ఇలాంటప్పుడు అంతర్గత విలువకు లభించే స్టాక్స్‌ తక్కువగానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.

సరైన ధర
సరైన ధర వచ్చే వరకు వేచి చూడాలి.. ఇన్వెస్టర్లకు 1993 లేఖలో బఫెట్‌ ఇచ్చిన సూచన ఇది. పెట్టుబడులకు సంబంధించి ఎలా నడుచుకోవాలో తెలియని ఇన్వెస్టర్లను మార్కెట్‌ క్షమించదని ఆయన చెబుతారు. అత్యుత్తమమైన కంపెనీ అయినా సరే షేరు ధర సహేతుక స్థాయి వద్ద ఉన్నప్పుడే ఇన్వెస్ట్‌ చేయాలన్నది బఫెట్‌ అనుసరించే సూత్రం. ఒక కంపెనీకి సంబంధించి ఆయన అనుసరించే అంశాలను గమనిస్తే.. ఎంపిక చేసుకునే కంపెనీ చేస్తున్న వ్యాపారం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. దీర్ఘకాలం పాటు అనుకూలతలు ఆ కంపెనీకి ఉండాలి. సమర్థులైన, నిజాయతీపరులైన వ్యక్తులు నడిపిస్తుండాలి. ఆకర్షణీయమైన ధర వద్ద ఉండాలి. వీటిల్లో మొదటి మూడు అంశాలకు రైట్‌ మార్కులు పడే కంపెనీలను ఆయన ఎన్నో సందర్భాల్లో గుర్తిస్తూనే ఉంటారు. కానీ, నాలుగో అంశమైన ఆకర్షణీయమైన ధర వద్ద లేకపోవడంతో బఫెట్‌ పెట్టుబడులకు దూరంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

మార్కెట్లో ప్రతి పతనం పెట్టుబడికి అవకాశం కావాలనేమీ లేదు. కొన్ని సందర్భాల్లో కంపెనీలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణం కావచ్చు. పెట్టుబడులకు ముందు భిన్నమైన అంశాలను విశ్లేషించుకోవాలని, వేగంగా స్పందించకుండా ఓపిక పట్టాలన్నది బఫెట్‌ ఫిలాసఫీ. పెట్టే ధర విషయంలో రిస్క్‌ తీసుకోవడం బఫెట్‌కు నచ్చదు. అవకాశం వచ్చే వరకు ఓపిక పట్టడమే ఆయన అనుసరించే విధానం. చక్కని అవకాశాలన్నవి మళ్లీ మళ్లీ వస్తుంటాయని ఆయన నమ్ముతారు. అందుకనే అందరూ ఎగబడి కొంటున్న వేళ అప్రమత్తంగా వ్యవహరించాలని.. అందరూ విక్రయిస్తున్న వేళ కొనుగోళ్లకు మొగ్గు చూపాలన్నది బఫెట్‌కు ఫలితాలిచ్చిన సూత్రాల్లో ఒకటి. ఎగసిపడే కెరటాన్ని పట్టుకోకుండా.. అది నేలను తాకే వరకు ఆగాలంటారు. 100–150–200 పీఈ వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు అయినా బఫెట్‌ సూత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement