
సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్
జాబితాలో లక్ష్మీ ఇండియా ఫైనాన్స్
జజూ రష్మీ రిఫ్రాక్టరీస్, అజయ్ పాలీ
రెగాల్ రిసోర్సెస్, వెరిటాస్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా పుంజుకున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో పలు కంపెనీలు మరోసారి లిస్టింగ్ బాటలో సాగుతున్నాయి. తాజాగా ఐదు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో వెరిటాస్ ఫైనాన్స్, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్, అజయ్ పాలీ, జజూ రష్మీ రిఫ్రాక్టరీస్, రెగాల్ రిసోర్సెస్ చేరాయి. ఈ 5 కంపెనీలు 2024 డిసెంబర్, 2025 జనవరిలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఈ ఏడాది జనవరి 6న లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసిన ఎర్తూడ్ సరీ్వసెస్ ఇటీవల ఐపీవో డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుంది.
రూ. 2,800 కోట్లు: నాన్‌డిపాజిట్ ఎన్‌బీఎఫ్‌సీ వెరిటాస్ ఫైనాన్స్ ఐపీవో ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,200 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ విభాగంపై అధిక దృష్టిపెట్టిన కంపెనీ ఈక్విటీ జారీ నిధులను రుణ విడుదలకు సహకరించే మూలధన పటిష్టతకు వినియోగించనుంది.
ఎన్‌బీఎఫ్‌సీ..: ఎన్‌బీఎఫ్‌సీ.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఐపీవోలో భాగంగా 1.04 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 56.38 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు సహకరించే మూలధన పటిష్టత, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
రిఫ్రిజిరేషన్ సీలింగ్: రిఫ్రిజిరేషన్ సీలింగ్ సొల్యూషన్లు అందించే అజయ్ పాలీ ఐపీవోలో భాగంగా రూ. 238 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 93 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు ప్లాంట్, మెషినరీ తదితర పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది.
రూ. 190 కోట్లు సహా..: రెగాల్ రిసోర్సెస్ ఐపీవోలో భాగంగా రూ. 190 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్ 90 లక్షల షేర్ల వరకూ ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రూ. 150 కోట్లు మాత్రమే: ప్రాస్పెక్టస్ ప్రకారం జజూ రష్మీ రిఫ్రాక్టరీస్ ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను జార్ఖండ్‌లోని బొకారో ఫెర్రో అల్లాయ్స్ విస్తరణకు వీలుగా కొత్త తయారీ సౌకర్యాలపై వెచి్చంచనుంది. నిధులలో కొంతమేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు సైతం వినియోగించనుంది.
మెప్పించని ఏథర్ ఎనర్జీ ఎంట్రీ
ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ షేరు లిస్టింగ్ రోజే నష్టాలు చవిచూసింది. ఇష్యూ ధర(రూ.321)తో పోలిస్తే బీఎస్‌ఈలో 1.57% స్వల్ప ప్రీమియంతో రూ.326 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలో 4% లాభపడి రూ.333 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనై ఆరంభ లాభాలు కోల్పోయింది. ఒకానొక దశలో 6.50% క్షీణించి రూ.300 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ. 302.50 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.11,267 కోట్లుగా నమోదైంది. ‘‘ఏథర్ ఎనర్జీ షేరు నామమాత్రపు ధరతో లిస్టింగ్ అవ్వడం, ఇంట్రాడేలో 6.50% పతనం పరిణామాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్లు అధిక వాల్యుయేషన్ల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తుంది’’ అని లెమాన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకుడు గౌరవ్ గార్గ్ తెలిపారు.