
ఉద్యోగుల సంక్షేమం, కుటుంబ వ్యక్తిగత జీవనాన్ని మెరుగుపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రభుత్వంలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పెళ్లి కోసం 10 పనిదినాల పూర్తి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తమ పౌరులకు పని-జీవిత సమతుల్యత, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి దుబాయ్ ప్రకటించిన ఈ నూతన సెలవు విధానం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది.
దీనికి సంబంధించి యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిక్రీ జారీ చేశారు. ఈ కొత్త ఆదేశాలు వివిధ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న యూఏఈ పౌరులందరికీ వర్తిస్తాయి. ఇందులో దుబాయ్ ప్రభుత్వ విభాగాలు, న్యాయాధికారులు, సైనిక సిబ్బంది, ఫ్రీ జోన్లు, స్పెషల్ డెవలప్‌మెంట్ జోన్లు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డీఐఎఫ్సీ) వంటి సంస్థలు ఉన్నాయని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. భవిష్యత్తులో అదనపు కేటగిరీల ఉద్యోగులను కవర్ చేయడానికి విస్తరణకు కూడా ఈ డిక్రీ అనుమతిస్తుంది.
కొత్త వివాహ సెలవుకు అర్హత పొందడానికి ఉద్యోగులు వారి ప్రొబేషనరీ వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. అలాగే తాము పెళ్లి చేసుకోబోయే వారు కూడా యూఏఈ పౌరులే అయి ఉండాలి. 2024 డిసెంబర్ 31 తర్వాత అయిన వివాహాలకే ఇది వర్తిస్తుంది. ఈ వివాహ ఒప్పందాన్ని యూఏఈ అధీకృత సంస్థలు అధికారికంగా ధృవీకరించాలి. వెరిఫికేషన్ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ సర్టిఫైడ్ కాపీ అవసరం. పెళ్లి జరిగిన రోజు నుంచి ఈ సెలవులను ఒకసారి కానీ, విడదలవారీగా కానీ ఉపయోగించుకోవచ్చు. వివాహ సెలవుల కాలంలో ఉద్యోగికి వర్తించే అన్ని అలవెన్సులు, ఆర్థిక ప్రయోజనాలతో సహా పూర్తి వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.