● పెట్టుబడులు తిరిగి వస్తాయనే ఆశాభావంతో బాధితులు ● పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కేంద్రం ఏర్పాటుతో దూరాభారం
సూపర్‌బజార్(కొత్తగూడెం): అగ్రిగోల్డ్ బాధితుల నమోదు ప్రక్రియ బుధవారం హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రారంభమైంది. తొలి రోజు ఆళ్లపల్లి మండలానికి చెందిన వారికి టోకెన్ నంబర్లు కేటాయించి వివరాలు నమోదు చేసుకున్నారు. దీంతో తమ పెట్టుబడులు తిరిగి వస్తాయని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల బాధితులకు ఇబ్బందిగా మారింది. రోడ్డు సక్రమంగా లేకపోవడం, రవాణాకు కనీసం ఆటోలు కూడా లేకపోవడంతో అవస్థ పడ్డారు. కేంద్రం వద్ద తాగునీరు ఏర్పాటు చేశారు. నమోదుకు సమయం తీసుకోవడం పరిసరాల్లో టీ, టిఫిన్ సౌకర్యాలు లేకపోవడం, కొందరు అవగాహన లేక కలర్ జిరాక్స్‌లు తెచ్చుకోకపోవడంతో బాధితులకు పాట్లు తప్పలేదు. జిల్లా కేంద్రంలోని ఓఎస్డీ కార్యాలయం, కొత్తగూడెం క్లబ్, ఆర్డీఓ కార్యాలయంలో లేదా, బస్టాండ్ సమీపంలో నమోదు కేంద్రం ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు.
నమోదును స్వాగతిస్తున్నాం
అగ్రిగోల్డ్ బాధితుల వివరాల నమోదు ప్రక్రియను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని, బాధితులందరికీ న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాను గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాసినట్లు గుర్తుచేశారు.


