భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం రామసేవా మండపంలో కొలువుదీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆ తర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా, పూర్తిచేశారు.
25న నిత్యకల్యాణం రద్దు
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 25న నిత్యకల్యాణాన్ని రద్దు చేస్తున్నట్లు ఈఓ దామోదర్‌రావు తెలిపారు. కార్తీక మాసంలో నిర్వహించే కృత్తికా దీపోత్సవాన్ని పురష్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో అర్చన చేయడమే కాక హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, మూర్తిశర్మ పాల్గొన్నారు.
ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి
ములకలపల్లి: ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు ఇప్పటి నుంచే దృష్టి సారించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈఓ) సీహెచ్. వెంకటేశ్వరరావు సూచించారు. ములకలపల్లి జూనియర్ కాలేజీని గురువారం తనిఖీ చేసిన ఆయన ఒకేషనల్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఓజేటీ తీరును పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ విద్యార్థుల క్రమం తప్పకుండా కాలేజీకి హాజరయ్యే పర్యవేక్షించాలని తెలిపారు. అంతేకాక బోధనపై ప్రత్యేక దృష్టి సారించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసిన ఆయన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రిన్సిపాల్ కల్పన, అధ్యాపకులు పాల్గొన్నారు.
పీజీ అడ్మిషన్లు ప్రారంభం
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఐదు విభాగాల్లో 25సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇందులో 13 సీట్లు రాష్ట్ర కోటాలో, 12 సీట్లను జాతీయ కోటా కింద భర్తీ చేస్తారు. ఈక్రమాన నీట్ ర్యాంకర్లు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు పెట్టుకుంటున్నారు.


