నీటి వినియోగంలోనూ అసమానతలేనా? | - | Sakshi
Sakshi News home page

నీటి వినియోగంలోనూ అసమానతలేనా?

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

మరోవైపు నారుమళ్లు సిద్ధం

సీడ్‌ ప్రొడక్షన్‌ పేరుతో వరి పంటకు సిద్ధమవుతున్న కొందరు బడాబాబులు

ఆరుతడి పంటల పేరిట సాగునీరు మళ్లించుకునే ప్రయత్నాలు..

మరోవైపు పంటలు వేయకుండా

నష్టపోతున్న సామాన్య రైతులు

చర్ల: ఎల్‌నినో ప్రభావంతో రబీ సీజన్‌లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, తాలిపేరు ప్రాజెక్ట్‌ నీటిని వరి సాగుకు విడుదల చేయలేమని అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురవక పోవడంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, తాగునీటి అవసరాలకే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. అయితే సీడ్‌ ప్రొడక్షన్‌ పేరుతో వరి సాగు చేసే కొందరు బడా రైతులు ఇవేమీ పట్టించుకోవడంలేదు. ఆరుతడి పంటలు అంటూ వరి విత్తనోత్పత్తి పంటలకు నీటిని మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నీటి వినియోగంలో అసమానతలు ఏమిటని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని సామాన్య రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఒకవైపు వరి వద్దంటూ హెచ్చరికలు..

నీటి వినియోగంపై విధివిధానాలు ప్రకటించాలి

వరి సాగు వద్దని ప్రాజెక్ట్‌లు, చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీరు పశువులు, మనుషుల తాగునీటి అవసరాలకే సరిపోతుందని అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. మండలంలోని సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులోనూ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇరిగేషన్‌, వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఇదే విషయాన్ని రైతులకు వివరించారు. దీంతో సామాన్య రైతులు పంటలు సాగు చేయకుండా నష్టపోతుంటే బడాబాబులు అధికారుల హెచ్చరికలను బేఖాతర్‌ చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్ట్‌ నీటి వినియోగంపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలని, ఆరుతడి పంటల పేరుతో విడుదల చేసిన నీటిని ఇతర పంటలకు మళ్లించకుండా పర్యవేక్షించాలని, సీడ్‌ ప్రొడక్షన్‌ కంపెనీల ఒప్పందాలు, సాగు విస్తీర్ణం, నీటి అవసరాలపై అధికారులు విచారణ జరపాలని రైతులు కోరుతున్నారు.

రబీ సీజన్‌లో తాలిపేరు ప్రాజెక్టు నీటిని వరి పంటలకు ఇవ్వబోమని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న కొందరు సీడ్‌ ప్రొడక్షన్‌ వరి సాగుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చర్ల మండలంలోని పలు గ్రామాల్లో వరినారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. గత రబీ సీజన్‌లోనూ వరికి సాగునీరు అందించబోమని అధికారులు ప్రకటించినా కొందరు సీడ్‌ ప్రొడక్షన్‌ రైతులు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో సాగునీటిని వరి పంటకు మళ్లించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎల్‌నినో నేపథ్యంలో రబీలో వరి సాగు చేయొద్దని అధికారుల సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement