గోదావరికి నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా మిథిలా స్టేడియం ప్రాంగణంలోని రామసేవా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఆదివారం భక్తులు విరాళం అందజేశారు. హైదరాబాద్ నగరంలోని నాగోల్ పరిధి అరుణోదయనగర్‌కు చెందిన నరసింహారావు – సీతాదేవి దంపతులు రూ.50 వేల చెక్కును ఆలయ ఈఓ దామోదరరావుకు అందించారు. దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఆలయ పీఆర్వో సాయిబాబు, వేదపండితులు పాల్గొన్నారు.
కార్తీక మాసంలో గోదావరి నదికి హారతులు సమర్పించడం విశేష ఫలప్రదమని భద్రాద్రి పురోహితుల సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్ తెలిపారు. ఆదివారం పురోహితుల సంఘం ఆధ్వర్యంలో గోదావరి తీరంలో కార్తీక హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయప్రోలు సత్యప్రసాద్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, తేజశర్మ, తిరుపతిరావు, సీబీఎస్‌ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


