● భద్రాచలం తహసీల్‌లో సిబ్బంది చేతివాటం ● సర్టిఫికెట్‌కో రేటు నిర్ణయించారని ఆరోపణలు ● పలుకుబడి ఉంటే గంటల్లోనే సర్టిఫికెట్ల మంజూరు
భద్రాచలంటౌన్: కుల, ఆదాయ, నివాస, కుటుంబ తదితర ధ్రువీకరణ జారీలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. దరఖాస్తుదారులను రోజుల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. ముడుపులు ముట్టజెబితేనే సర్టిఫికెట్లు తక్షణమే జారీ చేస్తున్నారని, ఒక్కో సర్టిఫికెట్‌కు ఒక్కో రేటు నిర్ణయించారని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి గత నెల 9న ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు నోటీసు బోర్డులో వివరాలు ప్రదర్శించలేదని సమాచారం. సాధారణంగా ఇలాంటి ధ్రువీకరణ పత్రాల జారీకి దరఖాస్తుల పరిశీలన, నోటీసుల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ తదితర ప్రక్రియలు నిర్ణీత పద్ధతిలో జరగాలి. కానీ దరఖాస్తు చేసుకుని నెల గడిచినా జారీ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. సామాన్యులు దరఖాస్తు చేసుకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుండగా, ఓ వ్యక్తి ద్వారా వచ్చిన దరఖాస్తులకు గంటల వ్యవధిలోనే సర్టిఫికెట్లు మంజూరవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓబీసీ సర్టిఫికెట్‌కు భారీగా డిమాండ్?
ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు కళాశాల ప్రవేశాలు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిర్ణీత గడువులోగా కుల, ఆదాయ సర్టిఫికెట్లు సమర్పించాలి. తహసీల్‌లో సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు రామాలయ అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉండటంతో తహసీల్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఓబీసీ సర్టిఫికెట్‌కు భారీగా డిమాండ్ చేస్తున్నారని, సిబ్బందికి సంబంధించిన వ్యక్తుల ఖాతాల్లోకి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయించుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
సమగ్ర విచారణ చేపట్టాలి
తహసీల్దార్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం, ముడుపుల వ్యవహారంపై విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కొన్ని నెలలుగా వచ్చిన దరఖాస్తులు, పెండింగ్ సర్టిఫికెట్లను పరిశీలించాలని, జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని భద్రాచలం తహసీల్దార్ కార్యాలయ పనితీరుపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
కార్యాలయంలో సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు నా దృష్టికి రాలేదు. సర్టిఫికెట్ల జారీ పారదర్శకంగానే సాగుతోంది. సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకోస్తే చర్యలు తీసుకుంటాను. –రవికుమార్, తహసీల్దార్, భద్రాచలం


