నాలుగు రోజులకే సరిపోతాయి..
ఆ బాధ్యత ప్రైవేట్ సంస్థకు అప్పగింత.. రెండు నెలలుగా సరఫరాకు బ్రేక్ హాస్టళ్లలో నిత్యావసరాలు నిండుకోవడంతో ప్రిన్సిపాళ్ల ఆందోళన జీసీసీ ఐదు బ్రాంచిల్లో గోదాంల మూత, ఉపాధి కోల్పోయిన 60 మంది గిరిజనులు
జీసీసీని తప్పించి..
ఉపాధి కోల్పోయిన స్వయం సహాయక
సంఘాల మహిళలు
భద్రాచలం జీసీసీ డివిజన్ పరిధిలో పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేట, మణుగూరు బ్రాంచీల ద్వారా 59 ఎస్టీ హాస్టళ్లు, 46 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 35 గురుకులాలు, 35 ఎస్‌ఎంహెచ్ హాస్టళ్లు, 16 కస్తూర్బా గాంధీ పాఠశాలలు.. మొత్తం 171 విద్యాలయాలకు నిత్యావసర సరుకుల సరఫరా జరిగేది. సరఫరా బాధ్యతలను ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించడంతో జీసీసీ ద్వారా సరుకుల రవాణా గత నెల నుంచి నిలిచిపోయింది. దీంతో సరుకులను నిల్వచేసే గోదాంలను మూసివేశారు. సరుకులు సరఫరా చేసే సిబ్బంది ప్రస్తుతం పనుల్లేక ఖాళీగా ఉంటున్నారు.
జీసీసీ యూనిట్ల మూత
కారం, పసుపు, పల్లీపట్టి, మిల్లెట్ చిక్కీ, సాంబార్ పొడితోపాటు నిత్యావసర సరుకులను ప్రైవేటు సంస్థే సరఫరా చేస్తుండగా.. ఆ ఉత్పత్తులను తయారు చేసే జీసీసీకి చెందిన నాలుగు యూనిట్లు మూతపడ్డాయి. ఉత్పత్తులపై ఆధారపడిన స్వయం సహాయక సంఘాల మహిళలు 60 మంది ఉపాధి కోల్పోయారు. ఉత్పత్తుల తయారీ కోసం బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని ఏర్పాటు చేసిన యంత్రపరికరాలు అలంకారప్రాయంగా మారాయి. బ్యాంకు రుణం ఎలా తీర్చాలో అర్థం కావడంలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలుగా సరుకులను
సరఫరా చేయని సంస్థ
జిల్లాలోని గిరిజన విద్యాలయాలకు ప్రతీ నెల విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇండెంట్ పెట్టగా, జీసీసీ నుంచి సరుకులు సరఫరా కావడంతో ఇబ్బంది లేకుండా మెనూ అమలు చేసేవారు. అయితే సదరు ప్రైవేట్ సంస్థ సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన సరుకులను ఇంతవరకు పంపిణీ చేయలేదు. దీంతో గిరిజన హాస్టళ్లు, గురుకులాల్లో సరుకులు నిండుకున్నాయి.
ప్రిన్సిపాళ్ల ఆందోళన
గిరిజన హాస్టళ్లు, గురుకులాలతోపాటు సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు కూడా జీసీసీ నుంచే ఇప్పటివరకు సరుకులు సరఫరా చేశారు. ఇప్పుడు అన్నింటికి సరఫరా బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించడం, ఆ సంస్థ ఆదిలోనే సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు భోజనం వడ్డించేందుకు నిత్యావసరాలు ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లిగడ్డలు, చింతపండు, ఎండిమిర్చి ఎట్లా?
గతంలో సరుకులన్నీ జీసీసీ నుంచే సరఫరా చేసేవారు. కొత్తగా ప్రైవేటు సంస్థతో చేసుకున్న ఒప్పందంలో ఉల్లిగడ్డలు, చింతపండు, ఎండిమిర్చి లేవు. వీటిని ఐటీడీఏ నుంచి సరఫరా చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. కానీ ఇంతవరకు అధికారికంగా మార్గదర్శకాలేవీ రాలేదు. ఫలితంగా వార్డెన్లు సొంత ఖర్చులతో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సివస్తోంది.
గిరిజన సహకార సంస్థ ద్వారా నిర్వహించే గిరిజన హాస్టళ్లకు నిత్యావసర సరుకుల సరఫరా ఇటీవల నిలిచిపోయింది. ఇల్లెందులో ఉన్న జీసీసీ ఉత్పత్తుల కేంద్రం నుంచి పసుపు, కారంలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేలా చర్యలు తీసుకుంటాం.
–రామానుజం, జీసీసీ డీఎం
కిన్నెరసాని గిరిజన క్రీడా ఆశ్రమ పాఠశాల్లో 229 మంది విద్యార్థులు ఉండగా, నిత్యావసర సరుకులు కేవలం నాలుగు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన ఇండెంట్ పంపినా సరుకులు రాలేదు. దీంతో కారం, ఉప్పు, పప్పు, నూనె తదితరాలను అప్పు చేసి కొనుగోలు చేస్తున్నామని, విద్యార్థులకు ఇబ్బందిలేకుండా చూస్తున్నామని హెచ్‌ఎం చందు తెలిపారు. కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలకు కూడా సరుకులు రాలేదని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్ తెలిపారు. ఎస్‌ఎంహెచ్, కస్తూర్బా, గురుకుల హాస్టళ్లలో కూడా సరుకులు నిండుకున్నాయి. తక్షణమే నిత్యావసర సరుకులు పంపిణీ చేయకపోతే విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడక తప్పదు.
గిరిజన హాస్టళ్లకు సరుకుల సరఫరా బాధ్యత నుంచి తప్పించిన ప్రభుత్వం


