రాపత్తు సేవలు రామసేవా మండపంలో.. | - | Sakshi
Sakshi News home page

రాపత్తు సేవలు రామసేవా మండపంలో..

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

● వచ్చే నెల 10 నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ● ముమ్మరంగా సాగుతున్న ఆలయ అభివృద్ధి పనులు ● పనులకు ఎక్కువ రోజులు ఆటంకం కలగకుండా అధికారుల నిర్ణయం!

● వచ్చే నెల 10 నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ● ముమ్మరంగా సాగుతున్న ఆలయ అభివృద్ధి పనులు ● పనులకు ఎక్కువ రోజులు ఆటంకం కలగకుండా అధికారుల నిర్ణయం!

భద్రాచలం: మరో నెల రోజుల్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పగల్‌పత్తు, రాపత్తు సేవల నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి వేదికలను నిర్ణయించారు.

భద్రగిరిలో ముక్కోటి ప్రత్యేకం

భద్రాచలంలో జరిగే ముక్కోటి ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భక్త రామదాసు కాలం నుంచి వైకుంఠ ఏకాదశికి ముందు పగల్‌పత్తు, రాపత్తు సేవలు, విలాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. పగల్‌పత్తు ఉత్సవాల్లో స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. గతంలో మిథిలా స్టేడియంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహిస్తారు. రాపత్తు సేవల్లో రాత్రివేళ స్వామివారి యాగభేరి మూర్తులను వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్వామివారి ఉత్సవ మూర్తులను పడమర వైపు నుంచే బయటకు తీసుకురావాలని వైదిక బృందం చెబుతోంది. అయితే అదే మార్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో ముక్కోటి ఏకాదశి వరకు ఆ పనులను నిలిపివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ సమయంలో పడమర వైపు నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి కల్యాణ మండపంలోని రామసేవా మండపంలో కొలువుతీర్చి స్వామి వారి అవతరాలను భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నారు. పగల్‌పత్తు సేవలకు సంబంధించి పనులను నిలిపివేయాలన్న నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది.

రాపత్తు సేవలు..

ఇక రాపత్తు సేవలు రామసేవా మండపంలో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందే మండపానికి వచ్చి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అభివృద్ధి పనులను ఎక్కువ రోజులు నిలిపివేయొద్దనే ఉద్దేశంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యాగభేరి (నిత్య కల్యాణ)మూర్తులుతో కాకుండా ప్రచార మూర్తులతోనే ఈసారి రాపత్తు సేవలు కొనసాగన్నాయి.

డిసెంబర్‌ 10 నుంచి ఉత్సవాలు

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు డిసెంబర్‌ 10 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 19న తెప్పోతవ్సం, 20న ఉత్తర ద్వార దర్శనం వేడుకలు, ఆ తర్వాత రాపత్తు సేవలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement